Cancer : మెదడుకు పాకుతున్న క్యాన్సర్ కారక వైరస్.. గుట్టురట్టు చేసిన భారత శాస్త్రవేత్తలు!

"ఎప్స్టెయిన్ బార్ వైరస్" (ఈబీవీ) క్యాన్సర్ కారకమైంది. ఇది మెదడులోని కణాలను ప్రతికూలంగా ప్రభావితం చేయగలదని, నాడీకణ రుగ్మతలను కలిగించగలదని వెల్లడైంది.

  • Written By:
  • Publish Date - July 13, 2022 / 12:30 PM IST

“ఎప్స్టెయిన్ బార్ వైరస్” (ఈబీవీ) క్యాన్సర్ కారకమైంది. ఇది మెదడులోని కణాలను ప్రతికూలంగా ప్రభావితం చేయగలదని, నాడీకణ రుగ్మతలను కలిగించగలదని వెల్లడైంది. ఐఐటీ ఇండోర్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. ఉమ్ము నీరు, చీముడు వంటి శరీర స్రావాల ద్వారా “ఎప్స్టెయిన్ బార్ వైరస్” వ్యాపిస్తుంది. వాస్తవానికి ఈ వైరస్ వల్ల ఎలాంటి హానీ ఉండదు. కానీ రోగ నిరోధక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్న పలువురిలో ఈ వైరస్ రియాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా క్యాన్సర్ ముప్పు చుట్టుముడుతుంది. రామన్ మైక్రో స్పెక్ట్రో స్కోపి టెక్నిక్ ద్వారా “ఎప్స్టెయిన్ బార్ వైరస్” కణాలు మెదడులోకి చొరబడి చేసే మార్పులను గుర్తించారు. మెదడులోని ఫ్యాటీ యాసిడ్స్, కార్బో హైడ్రేట్స్, ప్రోటీన్స్ వంటి బయో మాలిక్యూల్స్ లలో వివిధ మార్పులకు “ఎప్స్టెయిన్ బార్ వైరస్” కారణం అవుతోందని అధ్యయనంలో తేలింది. ఫలితంగా మెదడులోని కణాల పనితీరుకు ఆటంకం వాటిల్లుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. “ఎప్స్టెయిన్ బార్ వైరస్” వల్ల మెదడులోని నాడీకణ వ్యవస్థ పనితీరులో మార్పులు జరుగుతాయని వివరించారు. ప్రధానంగా మెదడులోని కణాల్లో ఉన్న లిపిడ్, కొలెస్ట్రాల్, ప్రో లైన్, గ్లూకోజ్ అణువుల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఈ బయో మాలిక్యులర్ అంశాలపై పడే ప్రతికూల ప్రభావం వల్లే .. మెదడులోని నాడీ కణాల పనితీరుకు అవరోధం కలుగుతోందని వివరించారు. క్యాన్సర్ కారక వైరస్ ల వల్ల శరీరంలోని ఇతర భాగాలు, అవయవాలు, కణజాలాలు, కణాలను ఉండే ముప్పుపై ఒక అంచనాకు వచ్చేటందుకు ఈ అధ్యయనం బాటలు వేసింది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “జర్నల్ ఏసీఎస్ కెమికల్ న్యూరో సైన్స్” జర్నల్ లో ప్రచురితం అయింది.