Vit Deficiency:ఈ లక్షణాలు మీలో ఉంటే… ఏ విటమిన్ లోపమే తెలుసా..?

విటమిన్ బి12...మానవ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఇది ఒకటి. ఈ విటమిన్ నీటిలో కరుగుతుంది.

  • Written By:
  • Publish Date - January 18, 2022 / 07:00 AM IST

విటమిన్ బి12...మానవ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఇది ఒకటి. ఈ విటమిన్ నీటిలో కరుగుతుంది. ఈ విటమిన్ సమ్రుద్ధిగా లభించే ఆహారం తీసుకోకపోయినట్లయితే విటమిన్ బి12 లోపం తలెత్తే ప్రమాదం ఉంటుంది. మన శరీరం దీన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకోలేదు. అంతేకాదు శాకాహార పదార్థాల నుంచి పెద్దగా ఈ విటమిన్ లభించదు. కాబట్టి దాదాపు 80శాతం వీగన్లు, వెజిటేరియన్లకు విటమిన్ 12 లోపం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ బి 12 తక్కువగా ఉన్నట్లయితే శరీరం పలు రకాలుగా ప్రభావితం అవుతుంది. రక్తహీనత నుంచి మొదలుకొని మతిమరపు వరకు, నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఇలా ఎన్నో విధాలుగా మనల్ని ప్రభావితం చేస్తుంటుంది. ఈ పోషక లోపం ఉన్నట్లయితే..మనం కొన్ని సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అవేంటో చూద్దాం.

డిప్రెషన్ : విటమిన్ బి 12 తక్కువగా ఉన్నట్లయితే హోమోసిస్టీన్ అనే అమైనో యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి. ఇవి మెదడు కణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మెదడుకు పంపే సిగ్నల్స్ పై దీని ప్రభావం ఉంటుంది. ఇవి కొందరిలో మూడు స్వింగ్స్ కు కారణం అవుతాయి. మరొ కొందరిలో డిప్రెషన్ కు దారి తీస్తుంది. విటమిన్ బి 12 సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్యను కొంతమేర తగ్గించుకోవచ్చు.
కళ్లు తిరగడం: విటమిన్ బి12 ఆరోగ్యకరమైన రక్త కణాలను తయారు చేస్తుంది. రక్తంలో చేరి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది . బి12 లోపిస్తే.. రక్తకణాలు తగ్గుతాయి. అంతేకాదు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో అలసట ఎక్కువ అవుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తుంది.

ఏకాగ్రత లేకపోవడం: చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. గతంలో మంచి జ్ఞాపకశక్తి ఉన్నవారిలో కూడా.. బి12 విటమిన్ లోపం ఉన్నట్లయితే ఏకాగ్రత లేకపోవడం, విషయాలు తరచూ మర్చిపోతుండడం గమనించవచ్చు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతున్నాయా లేదా అనేది పరీక్షించుకోవడం మంచిది. లేదంటే కొంత కాలానికి డిమోన్షియాకి దారి తీసే ప్రమాదం ఉంటుంది.

బి12 లోపానికి కారణాలు: దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది పెర్నీషియస్ అనీమియా. మన రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తుంది. జీర్ణాశయంలోని కణాలను నాశనం చేయడం వల్ల మనం తీసుకునే ఆహారంలోని విటమిన్ బి 12 అందదు. ఇది చాలా తక్కువగా జరుగుతుంది. రెండోవది మనం తీసుకునే ఆహారంలో సహజంగా విటమిన్ బి 12 తక్కువగా ఉండటం. వీగన్లు లేదా శాకాహారుల ఆహారంలో విటమిన్ బి 12 తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

మన శరీరానికి రోజుకు ఎంత వరకు విటమిన్ బి 12 అవసరం అవుతుందో తెలుసుకుని ఈ విటమిన్ అందించే ఆహారం తీసుకోవడం మంచిది.