ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎంతో మంది పొగ తాగుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాకుండా వారి వల్ల వారి కుటుంబ సభ్యులకు కూడా హానికరంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే ధూమపానం పై అవగాహన తీసుకురావడం కోసం అన్ని దేశాల ప్రభుత్వాలు ఎన్నో నిబంధనలను అమలులోకి తీసుకు వస్తూ, ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ విధంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలు మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు.
ఈ క్రమంలోనే ప్రతి సిగరెట్ బాక్స్ పై కూడా పొగ తాగటం హానికరమని రాసినప్పటికీ ప్రజలు ఏమాత్రం అలవాట్లను మార్చుకోవడం లేదు. అయితే ధూమపానం పై అవగాహన చేయడం కోసం కెనడా ప్రభుత్వం సరికొత్త ట్రెండ్ అమలులోకి తీసుకురానుంది. ఇకపై సిగరెట్ బాక్స్ పై మాత్రమే కాకుండా ప్రతి సిగరెట్ పై కూడా పొగ తాగుట హానికరం అంటూ ప్రింటెడ్ వార్నింగ్ అమలులోకి తీసుకు రావాలని భావిస్తోంది. ఇప్పటికే సిగరెట్ బాక్సుపై ఈ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ ఎవరూ కూడా వీటిని పాటించలేదు. అందుకే ప్రజలలో మార్పు కోసం కెనడా ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.
ఈ క్రమంలోనే కెనడా ఆరోగ్య శాఖ మంత్రి కరోలిన్ బెన్నెట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిగరెట్ ప్యాకెట్ ల పై ఉన్నటువంటి సందేశం వాటి కొత్తదనాన్ని కోల్పోయాయని, అందుకే విడివిడిగా ప్రతి పొగాకు ఉత్పత్తి పై ఈ విధమైనటువంటి హెచ్చరికలను అమలు చేయటం వల్ల అందరిలో అవగాహన ఏర్పడుతుందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కరోలిన్ వెల్లడించారు. 2023 ద్వితీయ భాగం నుంచి ప్రత్తి పొగాకు ఉత్పత్తిపై ‘ప్రతీ పఫ్ లో విషం’ అనే సందేహం రాస్తూ అమలులోకి తీసుకురావాలన్నది తమ ఆలోచన అని తెలిపారు.