Site icon HashtagU Telugu

Chikungunya : మొట్టమొదటి చికున్‌గున్యా వ్యాక్సిన్ రిలీజ్.. ఎలా పనిచేస్తుంది ?

Chikungunya Vaccine

Chikungunya Vaccine

Chikungunya : చికున్‌గున్యా వస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో.. గతంలో దాని బారినపడిన  చాలామందికి తెలుసు. భరించలేని కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో ఎంతగా సతమతం కావాల్సి ఉంటుందో చాలామంది చవిచూశారు. కొన్ని సంవత్సరాల క్రితం చికున్‌గున్యా మన దేశంలో విలయ తాండవం చేసింది. దీనిబారిన పడి ఎంతోమంది తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎట్టకేలకు ఈ భయానక వైరల్ వ్యాధికి వ్యాక్సిన్ వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి చికున్‌గున్యా వ్యాక్సిన్‌కు అమెరికా ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. చికున్‌గున్యా అనే వైరస్ సోకిన దోమలు కుడితే.. ఈ చికున్‌గున్యా వ్యాధి వస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను ఫ్రాన్స్‌కు చెందిన బయోటెక్ కంపెనీ ‘వాల్నేవా’ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను అమెరికా మార్కెట్లో ‘Ixchiq’ పేరుతో విక్రయించనున్నారు. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వారికి చికున్‌గున్యా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని అమెరికా ఆరోగ్య శాఖ(Chikungunya)  వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

వ్యాక్సిన్ ఇలా పనిచేస్తుంది..

ఈ వ్యాక్సిన్‌ను ఒకే డోసులో వేస్తారు. మిగతా వ్యాక్సిన్‌లలాగే ఇందులోనూ లైవ్ చికున్‌గున్యా వైరస్ ఉంటుంది. కానీ అది పూర్తిగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యానికి అస్సలు హానిచేయలేదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ వైరస్ బాడీలోకి వెళ్తుంది. దీన్ని మన శరీర రోగ నిరోధక వ్యవస్థ చూసి స్పందించి.. యాంటీబాడీలను రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీలు కొంతకాలం పాటు మన శరీరంలో యాక్టివ్‌గా ఉంటాయి. దోమలు కుట్టడం ద్వారా మన బాడీలోకి నిజంగా శక్తికలిగిన  చికున్‌గున్యా వైరస్ ప్రవేశిస్తే.. దాన్ని ఈ యాంటీబాడీలు వెంటనే అడ్డుకొని అంతం చేస్తాయి. ఈ వ్యాక్సిన్‌తో ఉత్తర అమెరికాలో 3,500 మందిపై రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఇది తీసుకున్నవారిలో సాధారణ సైడ్ ఎఫెక్ట్స్‌గా పరిగణించే.. తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, జ్వరం, వికారం వంటి లక్షణాలను గుర్తించారు.

నేటికీ ఆ ప్రాంతాలలో ఎక్కువే..

నేటికీ చికున్‌గున్యా ఎఫెక్ట్ ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలకు ఈ వ్యాక్సిన్ పెద్ద ఊరటను కలిగించనుంది. ప్రపంచవ్యాప్తంగా గత 15 సంవత్సరాలలో దాదాపు 50 లక్షల మంది చికున్‌గున్యా బారినపడ్డారని అమెరికా ఆరోగ్యశాఖ అంటోంది. చికున్‌గున్యా ఇన్‌ఫెక్షన్ అనేది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుందని తెలిపింది. వృద్ధులకు, ఇతరత్రా వ్యాధులు ఉన్నవారికి అది రిస్క్‌ను పెంచుతుందని అంటోంది.

Also Read: Hansika Motwani : పెళ్లి తర్వాత జీవితం గురించి హన్సిక కామెంట్స్.. అందుకే ఇంటి పేరు మార్చుకోను..