ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మూత్రవిసర్జన ఎక్కువగా చేయడం వంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. ఇవి మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలే అయినప్పటికీ, ఇవి అనేక ఇతర శారీరక సమస్యలలో కూడా కనిపిస్తాయి. అందుకే దీనిని చాలామంది సాధారణ సమస్యలుగా భావిస్తారు. కానీ ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ కు కూడా సంకేతాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ మధ్య కాలంలో మన జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. దీనికి తోడు వాతావరణ మార్పులు కూడా ఉండటంతో చాలా మంది వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే ఆరోగ్యంపరంగా ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే…విస్మరించకూడదు. కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా సంభవిస్తుంది. దీన్ని గుర్తించే లోపే సైలెంట్ కిల్లర్ గా మారుతుంది.
మూత్రపిండాల వైఫల్యానికి అనేక కారణాలు:
శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. మూత్రం ద్వారా శరీరం నుండి నత్రజనితో కూడిన విషాన్ని తొలగించడం, రక్తాన్ని శుభ్రపరచడం వీటి ప్రధాన విధులు. కిడ్నీకి ఏదైనా నష్టం లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దాని పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతో విషపూరితమైన అధిక మొత్తంలో ప్రోటీన్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ టాక్సిన్స్ శరీరం నుండి బయటకు వెళ్లవు. దీని కారణంగా మూత్రపిండాలతో పాటు ఇతర అవయవాల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కిడ్నీ వైఫల్యానికి అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు.
నివారణ
కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి భయపడవద్దు. కిడ్నీ ఇన్ఫెక్షన్ కు ఎన్నో చికిత్సలు ఉన్నాయి. కానీ సమయానికి చికిత్స తీసుకున్నట్లయితే…పరిస్థితి మన అదుపులో ఉంటుంది. ప్రారంభ దశలోనే దీనిని గుర్తించినట్లయితే తొందరగా నయం అవుతుంది.