Cancer: క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన, ప్రమాదకరమైన వ్యాధి. దీని నుండి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాధి చివరి దశకు చేరుకున్నప్పుడు ప్రాణాలను కాపాడటం దాదాపు అసాధ్యం అవుతుంది. అయితే ఈ కథనంలో మనం ప్రతి 8 నిమిషాలకు ఒకరి ప్రాణాన్ని తీస్తున్న ఒక ‘సైలెంట్ కిల్లర్’ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. దీని లక్షణాలు, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి 8 నిమిషాలకు ఒకరిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ ఏది?
మీడియా నివేదికల ప్రకారం.. ఈ ప్రమాదకరమైన క్యాన్సర్ పేరు సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్). గతంలో ఈ క్యాన్సర్ కేవలం వయసు పైబడిన మహిళలకే వస్తుందని భావించేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ వయసు ఉన్న మహిళలు కూడా ఈ బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ క్యాన్సర్ కారణంగా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం.
ఈ క్యాన్సర్ వేగంగా వ్యాపించడానికి కారణం ఏమిటి?
సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హెచ్‌పీవీ (HPV – Human Papillomavirus). ముఖ్యంగా టైప్ 16, 18 రకాలు అత్యంత ప్రమాదకరమైనవి. నిపుణుల ప్రకారం.. ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది దాదాపు 200 రకాలుగా ఉంటుంది. సుమారు 95 శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు చాలా కాలం పాటు హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ ఉండటం వల్లనే సంభవిస్తాయి.
Also Read: మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ఫైర్!
ఎవరికి ముప్పు ఎక్కువగా ఉంటుంది?
- నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ క్రింది వారిలో ముప్పు అధికంగా ఉంటుంది.
- తక్కువ వయస్సులోనే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే మహిళలు.
- త్వరగా రజస్వల కావడం లేదా ఆలస్యంగా మెనోపాజ్ (ముట్లు ఉడకడం) రావడం.
- ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం.
- అనేక సార్లు ప్రసవం జరిగిన చరిత్ర ఉన్నవారు (High Parity).
జీవనశైలి కూడా ఒక కారణమే
కేవలం శారీరక కారణాలే కాకుండా అలవాట్లు కూడా ముప్పును పెంచుతాయి. ధూమపానం, మద్యపానం, ఎక్కువ కాలం పాటు గర్భనిరోధక మాత్రలు వాడటం లేదా రోగనిరోధక శక్తిని తగ్గించే హెచ్ఐవి (HIV) వంటి వ్యాధులు ఉండటం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి
సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం.
అసాధారణ రక్తస్రావం: లైంగిక కలయిక తర్వాత పీరియడ్స్ మధ్యలో లేదా మెనోపాజ్ తర్వాత యోని నుండి రక్తస్రావం కావడం.
డిశ్చార్జ్: దుర్వాసనతో కూడిన నీళ్ల వంటి డిశ్చార్జ్ కావడం.
ఇతర లక్షణాలు: వ్యాధి పెరిగే కొద్దీ కారణం లేకుండా బరువు తగ్గడం, వెన్నునొప్పి లేదా నడుము నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు.
నివారణ మార్గాలు ఏమిటి?
సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ పొందడానికి యాక్టివ్ స్క్రీనింగ్ చాలా ముఖ్యం.
ప్యాప్ స్మియర్ టెస్ట్: దీని ద్వారా ప్రారంభ దశలోనే కణాల్లో మార్పులను గుర్తించవచ్చు.
తదుపరి పరీక్షలు: ప్యాప్ స్మియర్ లో ఏదైనా తేడా కనిపిస్తే కోల్పోస్కోపీ లేదా బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ (HPV Vaccine): ఈ ఇన్‌ఫెక్షన్ రాకుండా నిరోధించడంలో వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే యువతులు, మధ్య వయసు మహిళలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
