Site icon HashtagU Telugu

Iron Deficiency Symptoms: మీలో ఐరన్ లోపాన్ని ఇలా గుర్తించండి..

Iron

Iron

సాధారణంగా మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్‌ తో పాటు కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉండే ఆహార పదార్థాలను కూడా ప్రతి రోజూ తీసుకోవాలి. కాగా చాలామంది వారికీ తెలియకుండానే పోషకాలు ఉండే ఆహారాన్ని కాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మొదలైన వాటికి దూరంగా ఉంటూ జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు. కొంతమంది మంచి ఆహారం తీసుకున్నప్పటికీ వారికి ఐరన్ లోపం అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఐరన్ లోపం ఉంటే ఎంత మంచి ఆహారం తీసుకున్న కూడా కొన్ని కొన్ని సార్లు బలహీనంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా చిన్న చిన్న పనులు చేస్తే అలసిపోతూ ఉంటారు. మరి శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శరీరంలో ఐరన్ లోపం ఉంటే చిన్నచిన్న పనులు చేస్తే వెంటనే అలసిపోతూ ఉంటారు. అంతేకాకుండా చికాకుగా కనిపించడం, బలహీనంగా మారి ఏకాగ్రత లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఐరన్ లోపం ఉంటే నిద్రలో కాళ్లు అదేపనిగా కదిలిస్తూ ఉండడంతో పాటుగా కాళ్లు దురదలు పెడుతూ ఉంటాయి. ఇక మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తల నొప్పిగా అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు.

ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. దానివల్ల హైపోథారాయిడిజమ్ సమస్య తలెత్తుతుంది. అలాగే శరీరంలో ఐరన్ లోపం ఉంటే బరువు పెరగడం శరీరం చల్లగా అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శరీరం చల్లగా అవుతుంది అంటే ముఖ్యంగా శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్లు గుర్తించాలి. వీటితో పాటుగా జుట్టు ఊడిపోవడం, నాలుక మంట పుట్టడం, చర్మం పారిపోవడం లాంటి సమస్యలు కూడా ఐరన్ లోపం లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

Exit mobile version