వేసవికాలం మొదలవుతోంది. ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలం వచ్చింది అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి పానీయాలు. చాలా రకాల జ్యూస్ లను తాగుతూ ఉంటారు. బాగా మండుతున్న ఎండల్లో చల్లటి పానీయాలను తాగడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వేసవిలో విపరీతమైన చెమట కారణంగా డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలసట కూడా వస్తూ ఉంటుంది. వీటితోపాటు ఎసిడిటి,కడుపు ఉబ్బరం,గుండెల్లో మంట, అతిసారం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే వేసవిలో కొన్ని రకాల డ్రింక్స్ తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవి పానీయాల లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉండేది మజ్జిగ. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మజ్జిగ తాగడం వల్ల కడుపులో చల్లని అనుభూతి కలగడంతో పాటు, డిహైడ్రేషన్ సమస్యలు కూడా రావు. దీనిలో ప్రోబయాటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్ మీ గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్, బి12 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనసును శరీరాన్ని శాంత పరచడమే కాకుండా వడదెబ్బ నుంచీ కూడా రక్షిస్తాయి. మీకు మజ్జిగ ఇష్టం లేదంటే స్మూతీలా గానీ, పండ్ల ముక్కలతో కలిపి కానీ ట్రై చేయవచ్చట.
వేసవి కాలంలో తాగాల్సిన వాటిలో నిమ్మరసం కూడా ఒకటి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి నిమ్మరసంలోని యాసిడ్స్ తోడ్పతాయి. కాబట్టి ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ఒంట్లో నీటి శాతం పడిపోతూ ఉంటుంది. రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చట. మీరు సబ్జాగింజలు నానబెట్టిన నీటిలో నిమ్మరసం పిండి తీసుకుంటే ఇంకా మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఎండాకాలంలో చాలామంది ఇష్టపడే పానీయం కొబ్బరినీళ్లు.
సమ్మర్ లో ఎక్కువ మందిని బాధించే సమస్య మూత్రవిసర్జన. ఈ మూత్ర విసర్జన సమయంలో మంట వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కొబ్బరి నీళ్లు బెస్ట్ డ్రింక్ అని చెప్పాలి. కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
మండే ఎండలో.. చల్లని చెరకు రసం తాగితే అలసట, నిస్సత్తువ అన్ని కూడా ఇట్టే మాయం అవుతాయి. చెరుకు రసం శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుందట. చెరకు రసంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుందట. వేసవిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుందని చెబుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చెరకు రసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందట.