ప్రతి ఒక్కరి వంట గదిలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటాయి. వెల్లుల్లిని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఇకపోతే వెల్లుల్లి వల్ల అనేక లాభాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే.కాగా ప్రతిరోజు ఉదయం పరకడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయట. మరి పరగడుపున వెల్లుల్లి తింటే ఏమవుతుందో,ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతిరోజు ఉదయం లేవగానే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మానసికంగా కూడా ఎంతో దృఢంగా సంతోషంగా ఉంటారట. వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ అనే మూలకం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందట. అలాగే వెల్లుల్లిలో లభించే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయట. అంతేకాకుండా బ్యాక్టీరియాలను నశింప చేయడానికి వెల్లుల్లి దోహదం చేస్తుందని చెబుతున్నారు. వెల్లుల్లిలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల మన శరీరంలో పెరుగుతున్న క్యాన్సర్ కణాలను నిరోధించడానికి దోహదం చేస్తుందట.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగి శరీర బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. అలాగే ప్రేగులలో పేరుకుపోయిన మలినాలను బయటకు తొలగించి ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. వీటితో పాటు వెల్లుల్లి జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని సక్రియం చేస్తుందట. అలాగే గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుందట. పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినవచ్చు, వెల్లుల్లిని ఆహారంలో జోడించి తినవచ్చట. అలాగే వెల్లుల్లి నూనెను తయారు చేసి ఉపయోగించవచ్చట. వెల్లుల్లి సప్లిమెంట్లు తీసుకోవచ్చని చెబుతున్నారు.