Site icon HashtagU Telugu

Curd Rice : చాలా మంది చేస్తున్న తప్పులు ఇవే.. అసలు పెరుగు ఉదయం తినాలా? రాత్రా?

Curd

Curd

Curd Rice : పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచి, పేగుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది కాల్షియం, ప్రొటీన్లకు మంచి వనరుగా ఉంటుంది. కానీ, దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో తీసుకోకపోతే ఆశించిన ప్రయోజనాలు లభించవు. చాలామంది పెరుగు తినడంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు.అలా చేయడం వలన కొందరు అలర్జీలను కొని తెచ్చుకుంటారు. దగ్గు, గ్యాస్టిక్ సమస్యలతో బాధపడుతుంటారు. అందుకే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటించడం బెటర్. అవేమిటో, ఎప్పుడు తింటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

ఉదయం పెరుగు తీసుకోవడం మంచిదా?

ఉదయం పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యేకంగా అల్పాహారంలో పెరుగును చేర్చుకుంటే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండేందుకు కావలసిన శక్తి లభిస్తుంది. అంతేకాదు, ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం పెరుగును మజ్జిగ రూపంలో లేదా పండ్లతో కలిపి తీసుకోవచ్చు.

రాత్రిపూట పెరుగు తినడం సరైనదేనా?

ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే, పెరుగులో శ్లేష్మం (కఫం) పెంచే గుణాలు ఉంటాయి. దీంతో రాత్రి సమయంలో శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు వంటివి పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఆస్తమా, సైనస్ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగును దూరం పెట్టాలి. రాత్రిపూట శరీరం చురుగ్గా ఉండదు కాబట్టి, పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా గ్యాస్టిక్ సమస్యలు వెంటాడుతాయి. ఒళ్లు నొప్పులు, శరీరం వీక్ అయిపోతుంది. చాతిలో నొప్పి వంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి.

ఎప్పుడు తినడం ఉత్తమం?

పెరుగు తినడానికి ఉత్తమ సమయం పగటిపూట. ముఖ్యంగా అల్పాహారం లేదా మధ్యాహ్న భోజన సమయంలో తీసుకోవడం వల్ల దానిలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. మధ్యాహ్నం భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు చల్లగా ఉంటుంది. అంతేకాదు, దీనిలో ఉండే కాల్షియం, విటమిన్లు ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు కూడా లభిస్తాయి.

మరికొన్ని ముఖ్య విషయాలు

పెరుగును పుల్లగా మారకముందే తినడం మంచిది. అంతేకాకుండా, దీనిని వేడి చేసి తినడం వల్ల దానిలోని మంచి బ్యాక్టీరియా నశించిపోతుంది. కాబట్టి, వేడి ఆహారాలతో కలిపి తీసుకోకపోవడమే మంచిది. అలాగే, ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని పెరుగుకు బదులుగా, గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగును తీసుకోవడం మంచిది. షుగర్ లేదా ఉప్పు ఎక్కువగా కలపకుండా, సాదా పెరుగును తినడానికి ప్రయత్నించండి. ఇవి పెరుగులోని సహజ గుణాలను తగ్గిస్తాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే పెరుగు ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.