Site icon HashtagU Telugu

Eye Drops: అప్పుడు దగ్గు మందు.. ఇప్పుడు కంటి చుక్కల మందు.. ప్రాణాలకు ముప్పు!

Closeup Of Young Girl Applying Eyedrops On The Eye

Closeup Of Young Girl Applying Eyedrops On The Eye

Eye Drops: మనకు ఏదైనా అనారోగ్యం చేస్తే మందులు వేసుకుంటే మనకు అంతా నయమవుతుంది. కానీ ఒకవేళ మందులు వేసుకుంటే లేని అనారోగ్య సమస్యలు తలెత్తితే, ఏకంగా ప్రాణాల మీదకు వస్తే..? అచ్చం ఇలానే కొన్నిరోజుల క్రితం దగ్గు మందు వల్ల కలిగితే.. ఇప్పుడు కంటి చుక్కల మందు వల్ల తలెత్తింది. అమెరికాలోలో ఇండియాలో తయారైన కంటి చుక్కల మందు ప్రాణాలకు హాని కలిగిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.

గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ఎజ్రీకేర్ కంటి చుక్కల మందు కారణంగా అమెరికాలో పలువురికి కంటి చూపు పోయిందని తెలుస్తోంది. అమెరికాలోని 12 రాష్ట్రాల్లో కనీసం 55 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఒకరు మరణించినట్లు, మరో 5కి కంటిచూపు పోయిందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది.

‘న్యూయార్క్, వాషింగ్టన్ తో పాటు మరో 10 రాష్ట్రాల్లో పలువురు కంటి చుక్కలు వేసుకున్నా తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ ఫెక్షన్ కనిపించింది’ అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఈ క్రమంలో ఎజ్రికేర్, డెల్సామ్ కంటి చుక్కల కొనుగోళ్లు, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆదేశాలు జారీ చేసింది.

అటు గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ దీనిపై స్పందించింది. ‘ఎజ్రీకేర్, ఎల్ఎల్సీ, డెల్సామ్ ఫార్మా పంపిణీ చేసిన ఆర్టిఫీషియల్ టియర్స్ లూబ్రికాంట్ కంటి చుక్క్ల మందు సీసాలను మార్కెట్ నుండి స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నాం. ఈ మందు కలుషితమయ్యే అవకాశాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ప్రకటన విడుదల చేసింది.

కాగా గతంలో నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన డాక్-1 మ్యాక్స్ సిరప్ వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ లో చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే.