సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే యువతీ యువకులు దీర్ఘకాలం కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా “టెన్నిస్ ఎల్బో” అనే వ్యాధి ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా ఈ సమస్య క్రీడాకారుల్లో మాత్రమే వస్తుందని భావించేవారు. అయితే ఇటీవల 25 ఏళ్ల యువ టెకీకి టైపింగ్ చేస్తూ, కాఫీ కప్పు పట్టుకున్నప్పుడు మోచేతి వద్ద తీవ్రమైన నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించగా, ఆయనకు “టెన్నిస్ ఎల్బో” అని నిర్ధారణ అయింది. దీర్ఘకాలం ఒకే భంగిమలో పనిచేయడం, కీబోర్డ్‌పై నిరంతరం టైపింగ్ చేయడం, మోచేతి కండరాలపై ఒత్తిడి పడటం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
Baahubali – The Epic : బాహుబలి ప్రీమియర్ టికెట్ల పేరుతో మోసాలు..తస్మాత్ జాగ్రత్త
వైద్యుల ప్రకారం.. “టెన్నిస్ ఎల్బో” అనేది కండరాల ఇన్‌ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పి. ఇది మొదట తేలికగా మొదలైనా, పట్టించుకోకపోతే క్రమంగా చేతిని కదపడం కూడా కష్టమవుతుంది. డెస్క్ వద్ద సరైన ఎత్తులో కుర్చీ లేకపోవడం, మానిటర్ స్థానం తప్పుగా ఉండడం, చేతి కండరాలకు సరైన విరామం ఇవ్వకపోవడం ఇవన్నీ ప్రధాన కారణాలు. రోజుకు 8-10 గంటలు ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి, ఆ ప్రాంతంలో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడుతుంది. వైద్యులు హెచ్చరిస్తూ, ఈ సమస్యను తక్కువగా అంచనా వేయకూడదని, తొందరగా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
“టెన్నిస్ ఎల్బో” నుంచి బయటపడటానికి సరైన భంగిమలో కూర్చోవడం, తరచూ చిన్న విరామాలు తీసుకోవడం, చేతి కండరాలకు వ్యాయామాలు చేయడం చాలా అవసరం. నొప్పి తీవ్రమైతే ఫిజియోథెరపీ, ఐస్ ప్యాక్ లేదా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులతో ఉపశమనం పొందవచ్చు. వైద్యులు చెబుతున్నట్లుగా, ఐటీ ఉద్యోగులు రోజూ కొంతసేపు నడక, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే ఈ రకమైన సమస్యలు తక్కువవుతాయి. సరైన పనితీరు భంగిమను పాటించడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే ఈ తరహా వ్యాధులను నివారించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
