చలికాలం మొదలయ్యింది. ఈ సీజన్ లో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొంతమంది ఈ చుండ్రు తగ్గడం కోసం అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ కొందరికి చుండ్రు తగ్గదు. అయితే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి యాపిల్ సైడర్ వెనిగర్ చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. చుండ్రు సమస్యలతో పాటు అనేక రకాల జుట్టు సమస్యలకు యాపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది.
ఇందుకోసం ఒక కప్పు నీటిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి షాంపు తో స్నానం చేసిన తరువాత ఆ నీటిని తలపై మసాజ్ చేసుకోవాలి. ఆపై 20 నిమిషాల తర్వాత జుట్టును కడిగేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వెల్లుల్లిని మెత్తగా తురుముకుని రసం తీసి, ఆ రసంలో 2 టేబుల్ స్పూన్ ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత షాంపూతో తలను కడగాలి. ఈ విధంగా వారానికి ఒకటి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అదేవిధంగా అరకప్పు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి 30 లేదా 40 నిమిషాల తర్వాత షాంపూతో తల స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒక కప్పు నీటిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్, 2-3 స్పూన్ల ఆముదం కలపి ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసి ఆ తరువాత తల స్నానం చేయాలి. ఒక గిన్నెలో 3 చెంచాల కలబంద రసం తీసుకొని దానికి కొంచెం నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 15 నిమిషాల తరువాత స్నానం చేయాలి.