Site icon HashtagU Telugu

Covid: ఎనిమిది మందిలో ఆ ఒక్కరికి లాంగ్ కోవిడ్ లక్షణాలు.. పూర్తి వివరాలు మీకోసం!

Union Health Ministry

Union Health Ministry

కరోనా మహమ్మారి.. ఈ పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భయంతో వణికి పోతున్నారు. దాదాపు రెండేళ్లపాటు ప్రపంచాన్ని మొత్తం వణికించిన ఈ కరోనా మహమ్మారి తాజాగా మరొకసారి కోరలు చాస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు మళ్లీ అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి సోకినప్పటికీ బయటకు లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. కానీ శరీరం మాత్రం బలహీనంగా అవుతోందని, ఇలా చాలామందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ కరోనా మహమ్మారి బారిన పడిన ప్రతి 8 మందిలో,ఒకరిలో ఈ వైరస్ దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందని తెలిపారు.

అలాగే శ్వాసకోస సమస్యలు, నీరసం, రుచి, వాసన శక్తి తగ్గిపోవడం లక్షణాల్లో అన్నీగానీ లేదంటే వాటిలో కనీసం ఒకటి రెండు చాలాకాలం కొనసాగుతున్నాయని అంటున్నారు. కాగా ఈ వైరస్ విషయంలో సుదీర్ఘంగా, విస్తృత స్థాయిలో అధ్యయనం జరిపిన తరువాత కరోనాకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన అన్ని సర్వేల్లో సమగ్రమైనదని పేర్కొంటున్నారు. 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు వరకు నెదర్లాండ్స్‌ దేశంలో 76,422 మంది కరోనా బాధితులకు సంబంధించిన వివరాలను తీసుకొని, వారిలో కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలను సుదీర్ఘకాలం పరిశీలించారు. అలా రెండేళ్లకు పైగా సమయంలో 24 సార్లు వారి ఆరోగ్యాన్ని పరిశీలించి, పలు వివరాలను సేకరించారు.

ఈ క్రమంలోనే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే 21 శాతం మంది వారికీ కరోనా నిర్ధారణ అయిన మొదటి ఐదు నెలల పాటు ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలతో ఇబ్బందిపడినట్టు అధ్యయనంలో వెల్లడయ్యింది. అయితే ఇలాంటి వారి నుంచి ఇతరులకు కరోనా వైరస్‌ సోకడం లేదని తేలింది. అయితే లాంగ్ కోవిడ్ గురించి ఇప్పటికే తెలిసినా దానికి కారణాలపై మరింత లోతుగా పరిశీలన జరిపాల్సిన అవసరం ఉంది అని పరిశోధనకు నేతృత్వం వహించిన గ్రొనింజెన్‌ వర్సిటీ శాస్త్రవేత్త జుడిత్‌ రొస్ మిలెన్‌ తెలిపారు.