మొలకలు లేదా స్ప్రౌట్స్ తినడం ఈ మధ్యకాలంలో అలవాటుగా మారిపోయింది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిశాక ప్రతి ఒక్కరు కూడా మొలకెత్తిన గింజలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. మొలకల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండి కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయని చెబుతారు. అయితే ఇవి అందరి విషయంలో ఒకే విధంగా పనిచేయవని, కొందరిలో ప్రమాదకరంగానూ మారుతాయని నిపుణులు చెబుతున్నారు. అవునండి మీరు విన్నది నిజమే, మొలకలు అందరికీ మంచి చేయవట.
మొలకలలో విటమిన్ సి, ఫైబర్, జింక్, ఇనుము, కాల్షియం, ఫోలెట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొలకల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గి జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందట. ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకలు వంటి ఆహారాలను తినే వ్యక్తులు మలబద్ధకంతో బాధపడే అవకాశం తక్కువగా ఉందట. మొలకలు తినడం వల్ల అందులో ఉండే ఫైబర్, మరికొన్ని పోషకాలు జీర్ణ సమస్యలను నివారించడంలో చాలా బాగా పనిచేస్తాయట. ఈ మొలకల ద్వారా బాడీలో హెచ్‌డిఎల్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఈ మొలకలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందట. రక్తపోటు కంట్రోల్లో ఉంటుందట. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని అంటున్నారు.
మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉండే విటమిన్ సి, మరిన్ని పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా బాగా తోడ్పడతాయట. వీటిలో ఉండే విటమిన్ ఏ కంటిశుక్లం, రేచీకటి వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. మొలకలు తినడం వల్ల శరీరానికి విటమిన్ బి లభిస్తుందట. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే మొలకల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తినడం మంచిది కాదట. ఒక రోజులో గుప్పెడు లోపు తినాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సరైన పద్ధతిలో మొలకలు తయారు చేసుకోవడం చాలా అవసరం. సరిగా శుభ్రం చేయని గింజలతో, గింజల్ని చుట్టే వస్త్రంతో ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. నాణ్యత లేని మొలకలు తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. అలాగే వాంతులు, విరేచనాలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందట. మొలకల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు మొలకల తీసుకోవడం గురించి వైద్యుడితో మాట్లాడాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల మొలకల్లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుందట. ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుందని, కాబట్టి రక్తం పలుచగా కావడానికి మందులు వాడే వారికి ఇది సమస్యలు కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.