Fruits & Vegetables: కొన్ని పండ్లను, కూరగాయలను తొక్కలతో తినాల్సిందే..!

బంగాళదుంపు, బీరకాయ, సొరకాయ వంటి ఎన్నో కూరగాయాలను (Vegetables) పొట్టు తీసేసి వంట చేస్తూ ఉంటాం.

బంగాళదుంపు, బీరకాయ, సొరకాయ వంటి ఎన్నో కూరగాయాలను (Vegetables) పొట్టు తీసేసి వంట చేస్తూ ఉంటాం. యాపిల్‌, ఆరెంజ్‌, కివి‌ వంటి ఎన్నో ఫ్రూట్స్‌కు (Fruits) తొక్క తీసేసి తింటూ ఉంటాం. తొక్క టేస్ట్‌‌గా ఉండదని, దానిపై కెమికల్స్‌ ఉంటాయని, త్వరగా అరగదని కొన్ని కూరగాయలు (Vegetables), పండ్ల (Fruits) తొక్కలు తీసేసి తీసుకుంటాం. మనం వృథా అంటూ పడేసే ఈ తొక్కలలో ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పండ్లతో దొరికే పోషకాలలో 25 నుంచి 30 శాతం తొక్కల్లోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలలో ఉండే ఫైబర్‌లో 31 శాతం పొట్టులోనే ఉంటుంది. ఏ పండ్లు, కూరగాయలు తొక్లలతో సహా తీసుకోవాలి? వాటిలో ఏ పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం..

నారింజ:

నారింజ తొనల కంటే.. తొక్కలలో విటమిన్‌ సీ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ బి6, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్‌ వంటి పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. నారింజ తొక్క త్వరగా జీర్ణం కాదు. చేదుగానూ ఉంటుంది. వీటిని కోరుకుని సలాడ్లలో వేసుకోవచ్చు. వాటిని ఎండబెట్టుకొని పొడి చేసుకొని వంటకాల్లో ఉపయోగించడం వల్ల పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయ లోపలి గుజ్జును తినేసి.. బయట చెక్క పడేస్తూ ఉంటాం. దీని తొక్కలో సిట్రులిన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది. కండరాల నొప్పులు తగ్గటానికీ సహాయపడుతుంది. ఇది రక్తంలోంచి నైట్రోజన్‌‌ను తొలగించడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ గుజ్జులో కన్నా తొక్కలోనే సిట్రులిన్‌ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తొక్కను కూరగాయల మాదిరిగా వేయించుకొని తినొచ్చు. కావాలంటే పచ్చడీ చేసుకోవచ్చు. ఈ తొక్కతో వడియాలు పెడతారు. పుచ్చకాయ ఉడికించుకొని జామ్‌ తయారుచేసుకోవచ్చు.

యాపిల్‌:

కొంతమంది యాపిల్‌ తొక్క తీసి తింటూ ఉంటారు. యాపిల్‌ పొట్టితో తింటే..విటమిన్‌ కె 332%, విటమిన్‌ ఎ 142%, విటమిన్‌ సి 115%, క్యాల్షియం 20%, పొటాషియం 19% ఎక్కువగా ఉంటుంది. ఫైబర్‌ కూడా అధికంగా లభిస్తుంది. ఇందులో క్వెర్‌సెటిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కూడా ఉంటుంది. ఇది బ్రెయిన్‌, లంగ్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కీర దోస:

కీర దోస ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని సాధారణంగా తొక్క తీసి తింటు ఉంటారు. దీన్ని పొట్టుతో తింటే.. మరిన్ని పోషకాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కీరా తొక్కలో.. పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, రక్తం గడ్డలు ఏర్పడకుండా చూడటానికి తోడ్పడే విటమిన్‌ కె కూడా అధికంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే సిలికా, జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్‌ కీరాదోసె పొట్టులో పుష్కలంగా ఉంటాయి.

బంగాళాదుంప:

బంగాళాదుంప లోపల కన్నా.. పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. పొట్టు తీసి ఉడికించిన దాని కన్నా పొట్టుతీయకుండా ఉడికించిన బంగాళాదుంపలో విటమిన్‌ సి 175%, పొటాషియం 115%, ఫోలేట్‌ 111%, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ 110% అధికంగా ఉంటాయి. వీటి తొక్కలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌ కడుపు నిండిన భావన కలిగేలా చేసి ఆకలిని అదుపులో ఉంచుతుంది.. తద్వారా బరువు తగ్గచ్చు.

మామిడి:

మామిడిపండు మనమంతా చెక్కు తీసి ముక్కలు కోసుకుని తింటాం. కానీ పై చెక్కుతో సహా జ్యూస్‌ చేయడం వల్ల మరిన్ని పోషకాలూ, పీచుపదార్థం శరీరానికి అందుతాయని చెబుతున్నారు వైద్యులు. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ ఇ, సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కెరొటినాయిడ్లూ అధికంగా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6.. రెండు రకాల పాలీఅన్‌సాచ్యురేటెడ్‌ ప్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి.

Also Read:  Winter Soups: శీతాకాలంలో ఈ 3 సూప్స్ ట్రై చేయండి..!