చాలామంది మగవారు సిగరెట్ తాగేటప్పుడు దాంతోపాటు కాంబినేషన్ గా టీ తాగుతూ ఉంటారు. కాఫీ చాలా తక్కువ మంది మాత్రమే తాగుతూ ఉంటారు.. అయితే ఇలా టీ, ఒకేసారి తాగడం అన్నది ఫ్యాషన్ అని అలా తాగితే బాగుంటుందని ఆ కాంబినేషన్ ని తెగ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా యువత ఇలా సిగరెట్, టీ రెండు ఒకేసారి తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని, అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. ఈ కాంబినేషన్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సిగరెట్‌లో ఉండే నికోటిన్ గుండెకు చేటు చేస్తుంది. ఇతరులతో పోలిస్తే ధూమపానం చేసేవారికి గుండె నొప్పి వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో నికోటిన్ సంకోచాన్ని కలిగిస్తుంది. తద్వారా స్వచ్ఛమైన రక్తం గుండెకు చేరకుండా అడ్డుకుంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. అలాగే టీ లో ఉండే పాలీఫెనాల్స్ గుండెకు మేలు చేస్తాయి. కానీ టీ లో పాలు కలపడంతో అవికాస్తా ప్రతికూలంగా మారతాయి. పాలలోని ప్రొటీన్ టీ లోని పాలీఫెనాల్ తో రియాక్ట్ అయ్యి దాని ప్రభావాన్ని తగ్గిస్తుందట. అందుకే ఎక్కువగా టీ తాగితే హృదయ స్పందన రేటును పెరగడంతో పాటు అధిక రక్తపోటుకు గురికావచ్చని చెబుతున్నారు. అందుకే ధూమపానం, టీ రెండూ గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయట.
కాబట్టి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటే రోగాలకు ఆహ్వానం పలికినట్టే అని చెబుతున్నారు. టీ సిగరెట్ల కలయిక గుండె జబ్బులు సహా అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుందట. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం పెరుగుతాయని చెబుతున్నారు. టీ లోని టాక్సిన్స్ సిగరెట్ పొగతో కలిసి ఈ ప్రమాదకరమైన వ్యాధికి కారణమవుతాయట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టీతో పాటు సిగరెట్ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ వల్ల ముఖ్యంగా నోరు, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఇది జీర్ణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందట. ప్రేగులు, కడుపుకు చేటు చేయడం వల్ల కడుపు నొప్పి, ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయట.
ధూమపానం చేస్తున్నప్పుడు రిలాక్స్ గా అనిపించినా ఆ తర్వాత మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతుందట. మరోవైపు టీ లో ఉండే కెఫిన్ వల్ల సరిగా నిద్ర రానివ్వదట. ఇవేకాక దంతాలు, నోటి ఆరోగ్యంపైనా టీ సిగరెట్ ప్రభావం చూపిస్తాయట. తెల్లటి దంతాలను పసుపు రంగులోకి మార్చడంతో పాటు దంతాల బలాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. దీనికి అదనంగా నోటి దుర్వాసన ఖాయం. నోటి క్యాన్సర్ ప్రమాదం కూడా పెంచుతాయట. టీ ఎక్కువగా తాగడం వల్ల మూత్ర విసర్జన పెరిగి, కిడ్నీలపై పనితీరు మందగించేలా చేస్తుందట. శరీరాన్ని డీహైడ్రేట్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని చెడగొడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.