Diet : పలుచటి మృదువైన ఇడ్లీ… వేడి వేడి దోశ… ఇవి లేనిదే బ్రేక్‌ఫాస్ట్‌కి ఊహించలేని స్థితి చాలామందికి. దక్షిణ భారతదేశపు హార్ట్‌బీట్ అనుకునే ఈ డిష్‌లు, ఇప్పుడు కొందరికి భయాలుగా మారాయి. ఫిట్‌నెస్ గురులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసే కొన్ని పోస్టుల కారణంగా “ఇవాళ్టి నుంచి ఇడ్లీ, దోశ నో” అంటున్నారు చాలామంది. వాటిలో వైట్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయని, అవి బరువు పెరగడానికి కారణమవుతాయని చెబుతున్నారు.
అయితే వాస్తవం ఏమిటి? నిజంగా ఇవి ఆరోగ్యానికి హానికరమా? బరువు తగ్గాలంటే వీటిని మానేయాలా?
ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానమిచ్చారు ఫిట్‌నెస్ కోచ్ విశ్వభారత్. “ఇడ్లీ, దోశలు తినొద్దు అన్నది పూర్తిగా అపోహ” అని ఆయన చెప్తున్నారు. ఇవి మనం వాడే మినపప్పు, బియ్యం కలిపి తయారుచేస్తాం. ఈ రెండు పకటమైన పోషకాహారాలే. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుంటే ఇవి బరువు పెరిగేలా చేయవు అని విశ్వ స్పష్టం చేశారు. వీటితో పాటుగా తీసుకునే చట్నీలు కూడా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయని చెబుతున్నారు. ఉదాహరణకు పల్లీ చట్నీ ప్రోటీన్‌లో రిచ్, కొబ్బరి చట్నీ ఆరోగ్యకరమైన కొవ్వులపై బేస్ అవుతుంది. కొంచెం నెయ్యి వేసుకుని తింటే శరీరానికి అవసరమైన హెల్తీ ఫ్యాట్స్ కూడా లభిస్తాయి.
మరీ ఎంత తినాలి?
ఇవన్నీ తినొచ్చంటున్నారు కదా అని మితిమీరి తినడం మాత్రం తప్పే. విశ్వభారత్ చెప్పినట్లు ఏ ఫుడ్ అయినా మితంగా తీసుకుంటేనే మంచిది. నోటికి రుచిగా ఉంది కదా అని ఐదు ఇడ్లీలు, నాలుగు దోశలు తినేస్తే బరువు పెరగక మానదు. మన శరీరానికి అవసరమైన కేలరీలకు తగ్గట్టుగా తీసుకోవాలి అని సూచిస్తున్నారు. అంతేకాదు, ఇడ్లీ, దోశలతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలు కూడా సూచిస్తున్నారు నిపుణులు. ఉదాహరణకి దోశలో పచ్చి ప్రోటీన్ పౌడర్ వేసుకోవచ్చు, లేదా పైన స్ప్రౌట్స్ చల్లి తినొచ్చు. ఇలా చేసినా రుచిలో మార్పు రాకుండా పోషకాల పరంగా ఎఫెక్టివ్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది.
సోషల్ మీడియా మాయలో పడకండి
ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో చాలా మంది తమ అభిప్రాయాలను ఆరోగ్య సూత్రాలుగా చూపిస్తున్నారు. కానీ అందులోని సమాచారం శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడకపోవచ్చు. అందుకే నిష్ణాతుల సలహాలు తీసుకోవడం అవసరం. “వైట్ కార్బ్స్” అనేది శత్రువు కాదని, అవి కూడా శరీరానికి అవసరమే అని నిపుణులు చెబుతున్నారు.
తీరుగా తినండి, ఆరోగ్యంగా ఉండండి
ఇడ్లీ, దోశలు మన ఆరోగ్యానికి హానికరం కావు. అవి మన సంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉండటం కూడా కారణమే కాదు. మనం ఎలా, ఎంత మోతాదులో తింటున్నామన్నది అసలు విషయం. శరీరానికి తగినంత పోషకాలు అందించేట్టుగా, మితంగా తీసుకుంటే ఇవి హెల్తీ ఆప్షన్‌లే. అవసరమైతే ప్రోటీన్, ఫైబర్ వంటి పదార్థాలతో వాటిని బలంగా మార్చుకోవచ్చు. అంతేకాదు మనం చిన్ననాటి నుంచి ఇష్టంగా తినే ఆహారాన్ని ఒక్క వీడియో చూసి వదలకండి. విషయాలను పరిశీలించండి. నిపుణుల మాట వినండి. అప్పుడే మీ ఆరోగ్యం కూడా మంచిదే, మానసిక ప్రశాంతత కూడా మీ సొంతం. కాగా, ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.