Site icon HashtagU Telugu

Curd: ఎండాకాలంలో ప్రతీ రోజు పెరుగు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

Curd

Curd

పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది పెరుగు తినడానికి ఇష్టపడితే మరి కొంతమంది మజ్జిగ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇకపోతే మిగతా సీజన్లతో పోల్చుకుంటే పెరుగును ఎండాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే వేసవికాలంలో పెరుగు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ ప్రతిరోజు తీసుకోవచ్చా అలా తీసుకుంటే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెరుగు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుందట. ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచివి అని చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందట. అయితే ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల కొంతమందికి అనుకూలంగా ఉండగా మరి కొంతమందికి ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందట. కొందరికి పెరుగును తిన్న తర్వాత మొటిమలు, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు, శరీర వేడి పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, ఇది పూర్తిగా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, శరీర స్వభావం, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. వేసవిలో పెరుగు తినడం కొంత మందికి మంచిదే, కానీ కొంతమందికి కాదట.

ఇది పూర్తిగా వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాత, పిత్త, కఫ లక్షణాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కొంతమంది పెరుగు తింటే శరీరానికి శక్తి వస్తుందని భావిస్తుంటారు. అయితే మరికొందరికి పెరుగు వల్ల శరీర వేడి పెరిగి జీర్ణ సమస్యలు రావచ్చట. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థితిని బట్టి పెరుగు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పెరుగు పుల్లగా మారినప్పుడు శరీర వేడిని పెంచే గుణాలు కలిగి ఉంటుందట. దీన్ని జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందట. పెరుగులో అధికంగా ఉండే కఫ గుణం వల్ల ఇది శరీరంలోని కఫాన్ని పెంచే అవకాశం ఉందట. అంతేకాకుండా పెరుగును ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు మలబద్ధకం, ఊపిరితిత్తుల సమస్యలు వంటి సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు. అయితే వేసవిలో ప్రతిరోజూ పెరుగు తినడం బదులుగా మజ్జిగ తాగడం ఉత్తమం అని చెబుతున్నారు. మజ్జిగ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుందట. మజ్జిగలో ఉప్పు, మిరియాలు, జీలకర్ర కలిపి తాగితే మరింత మంచిదని చెబుతున్నారు. పెరుగులో నీరు కలిపి మజ్జిగలా తీసుకుంటే పెరుగులోని వేడి సమతుల్యం అవుతుందట. దీనివల్ల పెరుగు వల్ల వచ్చే దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.