Site icon HashtagU Telugu

Diabetes Risk: ఒంటరిగా ఉండేవాళ్లకు షుగర్ ముప్పు “డబుల్”!!

Depression Imresizer

Depression Imresizer

ఒంటరిగా ఉండే వాళ్లకు.. ఒంటరితనం ఫీల్ అయ్యే వాళ్లకు టైప్ 2 డయాబెటిస్ (T2D) వ్యాధి ముసురుకునే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈవిషయం “వెస్టర్న్ నార్వే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్” శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరిగా ఉండేవాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి వల్ల వారికి షుగర్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. ఒంటరితనం వేధించడం వల్ల కార్టిజల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలో సమతుల్యతను దెబ్బతీస్తుంది. అంతేకాదు ఒంటరిగా ఉండేవాళ్లకు ఆకలి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈక్రమంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం వల్ల
శరీరంలోని రక్తంలోనూ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఒంటరిగా ఉండేవాళ్ళ ఇష్టానుసారమైన ఆహారపు అలవాట్లు వారికి షుగర్ ముప్పుకు చేరువ చేస్తాయి. హంట్ రిసెర్చ్ సెంటర్, నార్వే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా గతంలో నిర్వహించిన 4 వేర్వేరు అధ్యయన నివేదికలలోని గణాంకాల ఆధారంగా ఈ స్టడీ చేశారు. 1984 నుంచి 2019 మధ్య కాలంలో ఆ 4 సర్వేలు జరిగాయి. ఇందులో భాగంగా కూడగట్టిన 2.30 లక్షల మంది ఆరోగ్య సమాచారం ఆధారంగా నార్వే శాస్త్రవేత్తలు ఒంటరితనానికి, షుగర్ కు ఉన్న సంబంధాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. ఒంటరిగా జీవిస్తున్నా.. నెగెటివిటీకి తావు ఇవ్వని మైండ్ సెట్ కలిగిన వారికి షుగర్ ముప్పు తక్కువేనని గుర్తించారు. “నేను ఒంటరిగా బతుకుతున్నాను.నాకు ఎవరూ లేరు” అని మానసిక వేదనతో కుమిలిపోయే వాళ్లకు షుగర్ ముప్పు ఎక్కువని తేలింది.
కుటుంబంతో కలిసి ఉండే వాళ్ళతో పోలిస్తే ఒంటరిగా జీవించే వాళ్లకు టైప్ 2 మధుమేహం ముప్పు 2 రెట్లు ఎక్కువని అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరితనానికి, టైప్ 2 డయాబెటిస్ తో ఉన్న సంబంధం పై
అధ్యయనం జరిగినట్టే.. దానికి నిద్రలేమి, డిప్రెషన్ లతో ఉన్న లింక్ పైనా స్టడీ జరగాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.