Pregnant Women : వర్షాకాలంలో గర్భిణీలు వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి..!!

వర్షాకాలంలో ఉండే చల్లని వాతావరణం ఎవరికైనా అనారోగ్యం కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన జీవనశైలిలో ఉన్న గర్భిణీలకు మరింత జాగ్రత్త అవసరం. అంటు వ్యాధులు వ్యాపించడం, దోమలు కుట్టడం, చల్లటి వాతావరణం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు.. ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి.

  • Written By:
  • Publish Date - July 19, 2022 / 06:10 PM IST

వర్షాకాలంలో ఉండే చల్లని వాతావరణం ఎవరికైనా అనారోగ్యం కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన జీవనశైలిలో ఉన్న గర్భిణీలకు మరింత జాగ్రత్త అవసరం. అంటు వ్యాధులు వ్యాపించడం, దోమలు కుట్టడం, చల్లటి వాతావరణం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు.. ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అందువల్ల, గర్భిణీలు వర్షాకాలంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

పరిశుభ్రత విషయానికి వస్తే:
వర్షాకాలంలోనే కాదు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఎల్లప్పుడూ ముఖ్యం. వర్షాకాలంలో పొడిగా ఉండే లోదుస్తులను ధరించడం ..ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అలాగే కొందరికి రుతుక్రమంలో తెల్లటి స్రావం ఉంటుంది. కాబట్టి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే గర్భిణీ ఇంట్లో ఎవరైనా ప్రమాదవశాత్తు అనారోగ్యానికి గురైతే..అలాంటి సందర్భంలో వీలైనంత వరకు వారికి దూరంగా ఉండటం మంచిది. బాత్రూమ్, సింక్‌ల శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించండి.

ప్రతిరోజూ వేడినీటి స్నానం చేయడం అలవాటు చేసుకోండి :
రోజుకు రెండు సార్లు స్నానం చేయడం అవసరం. ఇలా చేస్తే మీ శరీరంలో జెర్మ్స్ , ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశాలను తగ్గిస్తుంది. వేడి నీళ్లలో వేపఆకులు లేదా వేడి నీళ్లతో డెటాల్ వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే గర్బిణీలకు మంచి స్నానాన్ని అందించడమే కాకుండా శుభ్రంగా…ఆరోగ్యంగా ఉంటారు.

విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి :
గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరికీ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వర్షాకాలంలో దీన్ని పాటించడం చాలా ముఖ్యం. సాధారణంగా వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి గర్భిణీలు ఆహారం సరిగ్గా తీసుకుంటేనే ఆరోగ్యకరమైన బిడ్డను పొందవచ్చు. వెచ్చని ఆహార పదార్థాలు తినడం, ఆరోగ్యకరమైన సూప్‌లు తాగడం మంచిది. బచ్చలికూర లేదా కాలే వంటి ఆకుపచ్చ కూరగాయలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే క్రిములు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

బయటి ఆహారాలకు దూరంగా ఉండండి:
ప్రెగ్నెన్సీ సమయంలో రుచికరమైన ఆహారాన్ని తినాలనే కోరిక ఉండటం సహజం. అలాంటప్పుడు ఇంట్లో వండిన ఆహారాన్ని వీలైనంత ఎక్కువగా తినండి. హోటళ్లు, బేకరీలు, స్ట్రీట్ ఫుడ్ తీసుకోవద్దు. ముఖ్యంగా వేయించిన ఆహారాలు, శుద్ధి చేసిన చక్కెర మిఠాయిల జోలికి వెళ్లకండి. ఇవి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాగే, ఆహారంలో కలిపిన రసాయన పదార్థాలు, రంగులు ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయి.

నిర్జలీకరణాన్ని నివారించండి:
సాధారణంగా ఎండలో చెమటలు పట్టినప్పుడు, దాహం వేసినప్పుడే నీళ్లు తాగుతాం. అయితే వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల నీరు ఎక్కువగా తాగాలని కాదు. గర్భిణీలో ఇది మరింత ప్రమాదకరం. శరీరంలో నీటిశాతం తగ్గితే కడుపులో బిడ్డ ఎదుగుదల కుంటుపడుతుంది. అలాగే గర్భిణీలు కళ్లు తిరగడం, బీపీ తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి శరీరానికి కావలసినంత నీటిని తాగండి. వీలైనంత వరకు వర్షాకాలంలో వేడి నీటికి ప్రాధాన్యత ఇవ్వాలి.

దోమలకు దూరంగా ఉండండి :
గర్భధారణ సమయంలో శరీరం మరింత సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడండి. మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.నీరు నిలవు లేకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే దోమలు రాకుండా నివారించవచ్చు.

ప్రస్తుతం ఉన్న పరిస్ధితులు అంతమంచిగా లేవు. మంకీ ఫాక్స్, కోవిడ్, చికెన్ గున్యా, డెంగీ లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కాబట్టి గర్బిణీలు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారా పదార్థాలు తీసుకోవడం మంచిది.