చలికాలంలో మనకు చాలా రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో ఉసిరికాయలు కూడా ఒకటి.. ఈ ఉసిరికాయలు ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తినే వారు కూడా ఉన్నారు. అయితే చలికాలంలో వచ్చే కొన్ని సీజనల్ వ్యాధుల నుంచి బయటపడాలంటే కొన్ని రకాల పండ్లు తీసుకోవడం ముఖ్యం. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. సిట్రస్ ఫ్రూట్స్ తింటే ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇందుకు ఉసిరి గొప్ప ఎంపిక అని చెప్పాలి. ఇందులో విటమిన్ సి, కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్ వంటి మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాయ తినడం మంచిదే కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఉసిరికాయ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉసిరి కాయలు గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే మహిళలు అసలు తినకూడదని చెబుతున్నారు. ఇవి స్త్రీలకు వేడి చేసే ప్రమాదం ఉందట. ఎక్కువగా తినడం వల్ల కడుపులో బిడ్డకు ఇబ్బంది ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
అలాగే పాలిచ్చే తల్లులు కూడా ఎక్కువగా ఉసిరి తినకూడదట. ఉసిరి ఎక్కువగా తింటే పిల్లలకు అజీర్తి సమస్య వస్తుందట. అలాగే రక్తసంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా ఉసిరికాయ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఉసిరిలో యాంటీ ప్లేట్‌లెట్ లక్షణాలు ఉన్నాయి. దీంతో ఉసిరి ఎక్కువగా తింటే రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చట. సాధారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉసిరి చాలా మంచిది. అయితే ఎవరైనా ఇప్పటికే ఏదైనా రక్త సంబంధిత రుగ్మతతో బాధపడుతుంటే, వారు ఉసిరిని తీసుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరికాయ తినకపోవడమే మంచిదట.
ఉసిరి తినడం వల్ల లక్షణాలు మరింత తీవ్రమవుతాయట. హైపర్ ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కడుపులో చికాకు, ఆమ్లత్వం ఏర్పడుతుందట. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఉసిరి చాలా మేలు చేస్తుంది. అయితే, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న వ్యక్తులు ఉసిరి కాయ తినకూడదు. తింటే చక్కెర స్థాయిలు తగ్గి నీరసం వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.