Blood Washing : ” బ్లడ్ వాషింగ్” చికిత్సకు లాంగ్ కొవిడ్ బాధితుల క్యూ.. ఏమిటిది?

కొవిడ్ నుంచి కోలుకున్న కొన్ని నెలల తర్వాత కూడా ఇన్ఫెక్షన్ లక్షణాలు కొనసాగితే .."లాంగ్ కొవిడ్" అంటారు.

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 08:30 AM IST

కొవిడ్ నుంచి కోలుకున్న కొన్ని నెలల తర్వాత కూడా ఇన్ఫెక్షన్ లక్షణాలు కొనసాగితే ..”లాంగ్ కొవిడ్” అంటారు. ఇలా లాంగ్ కొవిడ్ తో బాధపడుతున్న కొందరు కుబేరులు సరికొత్త చికిత్స చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే.. బ్లడ్ వాషింగ్. ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ ట్రీట్మెంట్ ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో లేదు. కేవలం సైప్రస్, జర్మనీ, స్విట్జర్లాండ్, టర్కీ దేశాల్లోని అతికొద్ది ఆస్పత్రుల్లో ఈ చికిత్స అందిస్తున్నారు. ఆ దేశాలకు వెళ్లి రావాలంటే ప్రయాణ, వసతి ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి. ఇక చికిత్స ఖర్చు దాదాపు రూ.15 లక్షలు. ఇంత భారీ వ్యయం ఉన్నా.. మన దేశం నుంచి ఎంతోమంది బ్లడ్ వాషింగ్ చికిత్స కోసం సైప్రస్, జర్మనీ, స్విట్జర్లాండ్, టర్కీ దేశాలకు వెళ్లారట!!

ఏమిటీ బ్లడ్ వాషింగ్ ?

బ్లడ్‌ వాషింగ్ చికిత్సా పద్ధతి ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. ఈ ప్రక్రియలో చికిత్స పొందే వారి శరీరం నుంచి రక్తాన్ని బయటకు తీస్తారు. వారి రక్తంలో ఉన్న కొవ్వులనూ, ఇన్‌ఫ్లమేషన్‌ కలిగించే ప్రోటీన్లను వేరు చేసి తొలగిస్తారు. దీంతో రక్తం శుద్ధి అవుతుంది. ఇంకా ఏమైనా అవసరమైన ఫ్లూయిడ్స్ ను కూడా రక్తంలోకి పంపిస్తారు. అనంతరం దాన్ని తిరిగి బాధితులకు ఎక్కిస్తారు. ఈ ప్రక్రియనే ‘బ్లడ్‌వాషింగ్‌’ అంటారు. వైద్యపరిభాషలో దీన్ని ‘ఎఫెరిసిస్‌’ అని పిలుస్తారు. యూరప్‌లోని చాలా దేశాల నుంచి లాంగ్ కొవిడ్ బాధితులు ఈ చికిత్స కోసం సైప్రస్, జర్మనీ, స్విట్జర్లాండ్, టర్కీలకు క్యూ కడుతున్నారు.

రక్తంలోని కొవ్వులు తీసేస్తే సరిపోతుందా?

నిజానికి కొవ్వుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్య (లిపిడ్‌ డిజార్డర్‌)లకు ఈ ‘ఎఫెరిసిస్‌’ ప్రక్రియ చివరి ప్రత్యామ్నాయమని జర్మన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ చెబుతోంది. అయితే ‘లాంగ్‌ కొవిడ్‌’ బాధితులకు ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశంపై ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే లాంగ్ కొవిడ్ కు బ్లడ్ వాషింగ్ ను ఓ నమ్మకమైన చికిత్సగా నిపుణులు భావించడం లేదు.

సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ఎఫెరిసిస్‌ చేయించుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ ప్రక్రియ కోసం ఉపయోగించే కొన్ని రసాయనాల (ఏజెంట్స్‌) వల్ల రక్తస్రావం, రక్తం గడ్డకట్టే అవకాశం, ఇన్ఫెక్షన్ల ముప్పు
వంటి అనేక సైడ్ ఎఫెక్ట్స్ పొంచి ఉంటాయి. ఈ చికిత్స చేయించుకున్న తర్వాత కూడా అనేక మంది లాంగ్ కొవిడ్ బాధితులకు ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ పేర్కొంది. ఈ ట్రీట్మెంట్ కోసం కొంతమంది బాధితులు తమ జీవితకాలపు సంపాదన అంతా ఖర్చు పెడుతున్నారని వ్యాఖ్యానించింది.

కొవిడ్ రోగుల రక్తంలోని మైక్రోక్లాట్స్‌ పోతాయా?

బ్లడ్ వాషింగ్ వల్ల రక్తంలోని కొవ్వులను తొలగించడం వల్ల రక్తంజిగురు స్వభావాన్ని కోల్పోతుంది. ఫలితంగా లాంగ్‌కోవిడ్‌ బాధితుల్లో కనిపించే చిన్న చిన్న రక్తపుగడ్డలు (మైక్రోక్లాట్స్‌) తగ్గుతాయనీ కొందరు వాదిస్తున్నారు. ఎవరికీ నష్టం లేకుండా ఇప్పటికే ఎంతో మంది బాధలు నివారిస్తున్నందున… ఈ చికిత్సా పద్ధతికి క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనతో యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన రాబర్ట్‌ ఏరియన్స్‌ అనే వాస్క్యులార్‌ బయాలజీ ప్రొఫెసర్‌ విభేదిస్తున్నారు.మైక్రోక్లాట్స్‌ అసలు అవెలా ఏర్పడుతున్నాయో తెలుసుకోకుండా… ఇలా వాటిని తొలగించడాన్నే  ఓ చికిత్స అనుకోవడం అసంబద్ధమైన అంశం అని ఆయన చెబుతున్నారు.