Site icon HashtagU Telugu

Paracetamol: గర్భిణీలు పారాసెట‌మాల్ వాడ‌కూడ‌దా? డ‌బ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే?

Paracetamol

Paracetamol

Paracetamol: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పారాసెటమాల్ (Paracetamol) ఉపయోగించకూడదని చెప్పగా, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. గర్భధారణ సమయంలో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం, ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్) ప్రమాదం పెరుగుతుందని ట్రంప్ వాదించారు.

ట్రంప్ వాదనను WHO ఖండించింది

గర్భధారణ సమయంలో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం పెరుగుతుందనడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని WHO ట్రంప్ వాదనను ఖండించింది. వైద్యుని సలహా మేరకు తీసుకున్నప్పుడు పారాసెటమాల్ గర్భధారణలో సురక్షితమైనదని WHO పేర్కొంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. WHO ప్రతినిధి తారిక్ జసరేవిక్ జెనీవాలో మాట్లాడుతూ.. “వ్యాక్సిన్‌ల వల్ల ఆటిజం రాదు, అవి ప్రాణాలను కాపాడతాయి. ఇది విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపించిన విషయం. ఈ విషయాలను నిజంగా ప్రశ్నించకూడదు” అని అన్నారు. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా ట్రంప్ చేస్తున్న వాదనకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది.

Also Read: Indian Cricketers: ఆన్‌లైన్ గేమింగ్ బిల్.. భారత క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ!

గర్భిణీ స్త్రీలకు ట్రంప్ సలహా

గర్భిణీ స్త్రీలకు అసిటామినోఫెన్ (పారాసెటమాల్) లేబుల్‌పై దాని వాడకం గురించి హెచ్చరికను జోడించాలని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు ఆదేశించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన గర్భిణీ స్త్రీలను పారాసెటమాల్ వాడకుండా ఉండాలని సలహా ఇచ్చారు. చాలామంది నిపుణులు ట్రంప్ తన వాదనలను అతిశయోక్తిగా చెప్పారని నమ్ముతున్నారు.

పారాసెటమాల్ వల్ల ఆటిజం వస్తుందని FDA ఇంతవరకు ఎలాంటి హెచ్చరికనూ జారీ చేయలేదు. ట్రంప్ వాదనను పూర్తిగా నిరూపించడానికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని FDA స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆటిజంను నయం చేసే ఒక ‘అద్భుత ఔషధం’ కూడా తాను కనుగొన్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మిషన్‌కు అమెరికా ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెనడీ జూనియర్ నాయకత్వం వహిస్తున్నారు.

Exit mobile version