Palak Panner: పాలక్ పన్నీర్ తినేముందు ఇది తెలుసుకోండి..

పాలక్ పన్నీర్ ను ఇష్టంగా తినే వారు ఎక్కువ మంది ఉంటారు. దాని రుచి అలా ఉంటుంది మరి.

పాలక్ పన్నీర్ ను ఇష్టంగా తినే వారు ఎక్కువ మంది ఉంటారు. దాని రుచి అలా ఉంటుంది మరి. కానీ, ఈ కాంబినేషన్ మంచి రుచిని ఇస్తుందేమో కానీ, పోషకాలను శరీరం నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో పాలక్ పన్నీర్ ను రోటీల్లో భాగంగా తీసుకుంటుంటారు. కాకపోతే కొన్ని రకాల కాంబినేషన్లు సరైనవో, కావో అన్నది చూసుకుని తినాల్సిందే.

‘‘ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటే మంచి పోషకాలున్నవి తీసుకోవడం కాదు. సరైన పోషకాలున్న వాటిని, సరైన కాంబినేషన్ లోనే తీసుకోవాలి’’ అని అగర్వాల్ తెలిపారు. కొన్ని రకాల పదార్థాలు, పరస్పరం మరో పదార్థంలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయని ఆమె అంటున్నారు.

క్యాల్షియం, ఐరన్ అలాంటి అసహజ కలయిక. పాలకూరలో ఐరన్ దండిగా ఉంటుంది. పన్నీర్ లో క్యాల్షియం ఎక్కువ. కానీ, క్యాల్షియం అన్నది ఐరన్ ను మన శరీరం తీసుకోకుండా అడ్డుపడుతుంది. కనుక పాలక్ పన్నీర్ కలిపి తీసుకున్నప్పుడు పాలకూరలో ఉండే ఐరన్ మన శరీరానికి అందకుండా పన్నీర్ లోని క్యాల్షియం అడ్డుకుంటుంది. కనుక పాలకూర ఆలూ కలిపి తీసుకోవచ్చు. అలాగే, పాలకూర కార్న్ కలిపి తీసుకోవచ్చని అగర్వాల్ సూచించారు. ఐరన్, క్యాల్షియం రెండు కూడా కుదరని కలయిక అని ఇతర పోషకాహార నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. అలాగే, ఐరన్ మాత్రలను పాలు, టీ, కాఫీలతో కలిపి తీసుకోకూడదు.