Air Pollution:గాలి కాలుష్యంతో లంగ్ క్యాన్సర్.. తాజా పరిశోధనల్లో వెలుగులోకి!!

వాహనాలు విపరీతంగా పెరిగాయి. పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలు పాటించని పరిశ్రమలు పెరిగాయి. ఫలితంగా గాలి కాలుష్యం దడ పుట్టిస్తోంది.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 06:45 PM IST

వాహనాలు విపరీతంగా పెరిగాయి. పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలు పాటించని పరిశ్రమలు పెరిగాయి. ఫలితంగా గాలి కాలుష్యం దడ పుట్టిస్తోంది. ఎంతోమందికి క్యాన్సర్‌ తరహా డేంజరస్ వ్యాధులు రావడానికి కారణ భూతం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పొగ తాగనప్పటికీ.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోవడానికి కారణం ఇదేనని తాజాగా ది లాన్సెట్ జర్నల్ లో ఒక అధ్యయన నివేదిక ప్రచురితం అయింది. లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ బృందం తాజా పరిశోధనల్లో ఈ కఠిన వాస్తవం వెలుగు చూసింది.

ఇలా తెలిసింది?

పొగ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తోంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులకు దిమ్మతిరిగే వాస్తవం తెలిసింది.
గాలి కాలుష్యం వల్ల వయసు పెరిగే కొద్దీ కొంతమంది ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కారక కణాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. అలాంటి డేంజరస్ క్యాన్సర్ కణాలు పెరిగి క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించడం వల్ల క్యానర్స్ నివారణ కోసం మందులు తయారు చేయడం మరింత సులభంగా మారుతుందని శాస్త్రవేత్తల టీమ్ కు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ చార్లెస్ స్వాంటన్ చెప్పారు.

వాస్తవాలు, గణాంకాలు..

* 2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అత్యధిక మరణాలకు కారణం స్మోకింగ్ చేయడమే.
* బ్రిటన్‌లో ప్రతి 10 మందిలో ఒకరు గాలి కాలుష్యం వల్లే చనిపోతున్నారు.
* భారత్‌లోనూ 2019లో గాలి కాలుష్యం వల్ల 16 లక్షల మంది చనిపోయినట్లు ది లాన్సెట్ కమిషన్ రిపోర్ట్ వెల్లడించింది.
* గాలి కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నమోదయ్యే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం పొగతాగడం కాదు.

క్యాన్సర్ గడ్డలు ఇలా ఏర్పడుతున్నాయి..

మనిషి వెంట్రుక కంటే కూడా సన్నగా ఉండే పీఎం 2.5 ధూళి కణాలపై ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ బృందం దృష్టి పెట్టింది. పీఎం 2.5 ధూళి కణాలు మనలోకి వెళ్లినప్పుడు ఊపిరితిత్తుల్లో ఇంటర్‌ల్యుకిన్-1-బీటా అనే సైటోకీన్‌ విడుదల అవుతుంది.
దాంతో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీసి తద్వారా కలిగే డ్యామేజ్‌ను నివారించేందుకు ఊపిరితిత్తుల్లోని కణాలను అది యాక్టివేట్ చేస్తుంది.
50 ఏళ్ల వ్యక్తులను తీసుకుంటే వారిలోని ప్రతి 6లక్షల కణాల్లో ఒక కణం, క్యాన్సర్ కారక మ్యూటేషన్లను కలిగి ఉంటుంది.
కానీ ఈ కణాలు సాధారణంగా నిద్రాణంగా ఉంటాయి. ఇంటర్‌ల్యుకిన్-1-బీటా సైటోకీన్స్ వల్ల ఆ కణాలు యాక్టివేట్ కావడం వల్ల గడ్డలు ఏర్పడతాయి. పరిశోధనలో భాగంగా గాలి కాలుష్యం వల్ల ఎలుకల్లో క్యాన్సర్ రాకుండా మందులతో శాస్త్రవేత్తలు అడ్డుకోగలిగారు.ఇంటర్‌ల్యుకిన్-1-బీటా సైటోకీన్స్ విడుదల కావడానికి జరిగే అలారమ్ సిగ్నల్‌ను వారు ఆపగలిగారు.