HIV-AIDS Cure: హెచ్ఐవీ వైరస్ ను నాశనం చేసే కొత్త ఔషధం! ఇజ్రాయిల్ శాస్త్రవేత్తల ఘనత

మానవాళిని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి ఇక పారిపోవాల్సిందే.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 11:42 AM IST

మానవాళిని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి ఇక పారిపోవాల్సిందే. ఎందుకంటే.. ఈ వ్యాధికి కారణమయ్యే వైరస్ ను పూర్తిగా నాశనం చేసే కొత్తరకం మెడిసిన్ ను ఇజ్రాయెల్ కు చెందిన టెల్ అవీస్ విశ్వవిద్యాలయం సైంటిస్టులు తయారుచేశారు. దీనిని ఇంజక్షన్ రూపంలో ఒక్కడోసు ఇస్తే చాలు.. అది హెచ్ఐవీని పూర్తిగా అడ్డుకుంటుంది. ఎయిడ్స్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధి చేసిన ఈ ఔషధం ఈ వ్యాధి బాధితులకు నిజంగా వరమే అని చెప్పాలి.

ఇప్పటివరకు ఎయిడ్స్ ని నిర్మూలించడానికి అనేక పరిశోధనలు జరిగాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా కోట్ల కొద్దీ డాలర్లను దీని విరాళంగా ఇచ్చింది. అయినా సరే సరైన అడుగులు పడలేదు. కానీ ఇప్పుడీ మెడిసిన్ మాత్రం బాధితుల జీవితాలను పూర్తిగా మార్చే ఔషధమంటున్నారు శాస్త్రవేత్తలు. శరీరంలో బి-టైప్ తెల్ల రక్త కణాలు ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్ లను నిరోధించి రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేసే కణాలు ఇవే. ఈ కణాలు.. మనిషి ఎముక మజ్జలో తయారవుతాయి. ఒక దశ దాటిన తరువాత అవి అక్కడి నుంచి రక్తం, గ్రంథులలోకి వెళతాయి. ఆ తరువాత శరీరమంతా వ్యాపిస్తాయి. కానీ ఇంతకాలం ఈ
బి-కణాలు. హెచ్ఐవీ వైరస్ పై దాడి చేయలేకపోయాయి. కారణం.. హెచ్ఐవీ వైరస్.. బి-కణాలను విచ్ఛిన్నం చేస్తుంది.

బి-కణాల జన్యువుల్లో మార్పులు చేయడానికి వైరస్ లోని కొన్ని భాగాలను ఉపయోగించారు శాస్త్రవేత్తలు. దీంతో వైరస్ దీనికి ఎదురుపడినా సరే.. వీటిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. పైగా వైరస్ ప్రవర్తను ఇవి ముందే పసిగట్టి దానికి అనుగుణంగా సిద్ధమై.. వైరస్ ను నాశనం చేసేలా రోగనిరోధవ్యవస్థ.. యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా చేస్తాయి. ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు వైరస్ ను అడ్డుకునే స్థాయిలో రక్తంలో కావలసినన్ని యాంటీబాడీలు తయారయ్యాయి. ఈ మెడిసిన్ హెచ్ఐవీతోపాటు క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడుతుంది. కాకపోతే దీనిపై మరికొన్ని లోతైన పరిశోధనలు జరగాలి. వ్యక్తులపైనా టెస్ట్ చేయాల్సి ఉంది. అందుకే మార్కెట్ లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది.