Site icon HashtagU Telugu

Cancer Research : గర్భాశయ కేన్సర్ ముప్పు పెంచే కొత్త డీఎన్‌ఏ మార్పులు వెలుగులోకి

Cancer Research

Cancer Research

Cancer Research : ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ప్రధానమైన గైనకాలజికల్ వ్యాధుల్లో గర్భాశయ క్యాన్సర్ (ఎండోమెట్రియల్ కేన్సర్) ఒకటి. ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల మంది మహిళలకు ఈ వ్యాధి నిర్ధారించబడుతుండగా, అందులో సుమారు లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుత వరకు ఈ వ్యాధికి గల సాధారణ కారకాలుగా మోటాపు, డయాబెటిస్, ఈట్రోజన్ హార్మోన్ అధికంగా ఉండటం, వయస్సు పెరుగుదల వంటి అంశాలు గుర్తించబడ్డాయి.

అయితే, ఈ క్యాన్సర్ కేసుల్లో సుమారు 5 శాతం జన్యుపరమైన కారణాల వల్లనే వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. లించ్ సిండ్రోమ్ లేదా కౌడెన్ సిండ్రోమ్ వంటి వారసత్వ వ్యాధుల వల్ల వచ్చే జన్యు మార్పులు దీని ముప్పును పెంచే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ చాలా గణనీయమైన జన్యు కారణాలు గుర్తించబడలేదు.

ఇలాంటి సమయంలో జర్మనీకి చెందిన హానోవర్ మెడికల్ స్కూల్ (MHH) పరిశోధకుల బృందం, గర్భాశయ క్యాన్సర్‌కు దారితీసే మరో ఐదు కొత్త జన్యు మార్పులను కనుగొనడం కీలకంగా మారింది. ఇప్పటికే గుర్తించబడిన 16 రిస్క్ జీన్స్‌కు తోడు, ఈ తాజా అధ్యయనంతో వాటి సంఖ్య 21కి చేరింది. ఇది మహిళలలో క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయడంలో దోహదపడనుందని బృందంలోని నాయకుడు డాక్టర్ థిలో డోర్క్-బౌసెట్ తెలిపారు.

ఈ పరిశోధనలో భాగంగా వివిధ దేశాల జాతీయ బయోబ్యాంకులలోని డేటాను సేకరించి, 17,000 మందికి పైగా గర్భాశయ క్యాన్సర్ ఉన్న మహిళల జన్యు గుణాల్ని 2.9 లక్షల ఆరోగ్యవంతుల మహిళల డీఎన్‌ఏతో పోల్చారు. ఆ తర్వాత మరో అధ్యయన బృందం ద్వారా ఈ ఫలితాలను ధృవీకరించారు.

ఇందులో ముఖ్యంగా ‘NAV3’ అనే జన్యుపై వారు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఇది కణ వృద్ధిని నియంత్రించే ‘ట్యూమర్ సప్రెసర్’ జీన్‌గా వ్యవహరిస్తుందని తేలింది. ఈ జీన్ సక్రియంగా ఉండగా కణాలు చనిపోతాయని, దాన్ని అణిచేస్తే కణాలు వేగంగా పెరుగుతాయని పరిశోధకురాలు డాక్టర్ ధన్యా రామచంద్రన్ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ ఉన్న కణాలలో ఈ జీన్ క్రియాశీలత గణనీయంగా తగ్గిపోయిందని ఆమె వివరించారు.

ఈ పరిశోధనతో మహిళలలో గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే అవకాశాలపై నూతన ఆశలు ఏర్పడ్డాయి. ప్రివెంటివ్ స్ట్రాటజీలు, కొత్త చికిత్సా విధానాల రూపకల్పనకు ఇది దారితీయవచ్చని పరిశోధక బృందం ఆశిస్తోంది.

Income Tax Bill 2025: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పాత ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ఉపసంహరణ!