Vitamin D : విటమిన్ డి ఎక్కువగా తీసుకున్నా డేంజరే

అతి ఏదైనా అనర్థమే...ఇది ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా వర్తిస్తుంది. విటమిన్లను సరైన పద్ధతిలో తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు.

  • Written By:
  • Publish Date - May 30, 2022 / 06:30 AM IST

అతి ఏదైనా అనర్థమే…ఇది ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా వర్తిస్తుంది. విటమిన్లను సరైన పద్ధతిలో తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. అదే ఎక్కువయితే మాత్రం సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా విటమన్ సప్లిమెంట్స్
గాయాలను నయం చేయడంలోనూ, సెల్యులార్ డ్యామేజ్‌ని సరిచేయడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి వాటిలో సహాయపడతాయి. విటమిన్ల లోపంతో స్కర్వీ, రక్తహీనత, రికెట్స్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది, వీటిని అధిగమించేందుకు విటమిన్స్ తీసుకుంటుంటారు. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం ఏమిటంటే, ఈ పోషకాలు ఎక్కువగా తీసుకుంటే మీకు కొన్ని దుష్ప్రభావాలు కూడా వస్తాయి.

విటమిన్-డి లోపం మన దేశంలో చాలా సర్వసాధారణంగా మారిపోయింది. దాదాపు 76% మంది భారతీయులకు విటమిన్ డి తగినంత స్థాయిలో లేదని సర్వేలో తేలింది. కొన్ని సార్లు సూర్యరశ్మి అనుకున్నంతగా శరీరానికి తగలకపోవడం విటమిన్ డి లోపానికి ప్రధాన కారణం. ఈ లోపాన్ని అధిగమించడానికి విటమన్ డి సప్లిమెంట్లను తీసుకుంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై సప్లిమెంట్లను తీసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది, అయితే దాని తీసుకోవడంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వీటిలో ముఖ్యమైంది రక్తంలో కాల్షియం యొక్క అధిక స్థాయికి సంబంధించినవి. రక్త ప్రసరణలో కాల్షియం స్థాయి పెరగడం వల్ల కణజాలం, అవయవాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా మూత్రపిండాలపై వీటి దుష్ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

అలాగే రక్తంలో అధిక స్థాయి కాల్షియం తీవ్రమైన ఎముక సమస్యలకు కూడా దారితీస్తుందిని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి వెన్నెముకపై ఇది ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తే అవకాశముంది. ఛాతీ నొప్పి, దగ్గు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక పెద్ద మోతాదులో విటమిన్ డి తీసుకోవడం వల్ల ఆకలిని కోల్పోవడం, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే విటమిన్ డి సప్లిమెంట్స్ వైద్యుల సూచన మేరకు తగిన మోతాదులోనే వాడడం ఉత్తమం.