Liver Illness: అమెరికా, ఐరోపా పిల్లల్లో అంతుచిక్కని కాలేయ రుగ్మత.. ఏమిటి.. ఎందుకు ?

ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడుతున్న అమెరికా, ఐరోపా దేశాల్లో.. మరో వణుకు మొదలైంది.

  • Written By:
  • Publish Date - April 16, 2022 / 04:54 PM IST

ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడుతున్న అమెరికా, ఐరోపా దేశాల్లో.. మరో వణుకు మొదలైంది. కొందరు పిల్లలను ఓ అంతుచిక్కని కాలేయ (లివర్) రుగ్మత వెంటాడుతోంది. దీనికి ఏ వైరస్ కారణం ? అనేది ఇంకా తెలియకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. 2021 నవంబరు నుంచే ఈ తరహా మిస్టీరియస్ కేసులు ఒక్కటొక్కటిగా బయటపడటం ప్రారంభమైంది. ఇప్పటివరకు బ్రిటన్ లో ఇటువంటి 74 కేసులు బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు పిల్లల పరిస్థితి విషమించడంతో కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చింది. అమెరికాలోనూ ఇటువంటివే 9 కాలేయ వ్యాధి కేసులు బయటపడ్డాయి. ప్రధానంగా అమెరికాలోని అలబామా రాష్ట్రం పరిధిలో ఈ కేసులు నిర్ధారణ అయ్యాయి.స్పెయిన్ లో మూడు, ఐర్లాండ్ లో కొన్ని ఇటువంటి కేసులను గుర్తించారు. హెపటైటిస్ లేదా కాలేయ వాపు లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన బాలల్లో ఈ అంతుచిక్కని కాలేయ రుగ్మతను గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అమెరికా డాక్టర్లు ఏమంటున్నారు..
బహుశా .. ఈ మిస్టీరియస్ ఇన్ఫెక్షన్ కు “అడినో వైరస్” కారణమై ఉండొచ్చని అమెరికాలోని అలబామా రాష్ట్ర వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరహా అస్వస్థతతో ఆస్పత్రుల్లో చేరిన చాలామంది పిల్లలకు హెపటైటిస్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. సాధారణంగా పిల్లల్లో గట్ వాపునకు కారణమయ్యే “అడినోవైరస్ 41” వల్ల ఈతరహా కాలేయ రుగ్మతలు తలెత్తుతుండొచ్చనే సందేహాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.

ఐరోపా డాక్టర్ల మాటేమిటి ..ఐరోపా దేశాల్లో ఈ తరహా అంతుచిక్కని కాలేయ రుగ్మత బారిన పడిన పిల్లలకు టెస్టులు చేశారు. ఇందులో కొందరికి “అడినో వైరస్” సోకినట్లు నిర్ధారణ కాగా, ఇంకొందరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించింది. గతంలో అడినో వైరస్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలకు “హెపటైటిస్” వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఐరోపా వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు