Site icon HashtagU Telugu

Mutton Keema Samosa: మటన్ ఖీమా సమోసా తయారీ విధానం గురించి మీకు తెలుసా?

Condoms In Samosas

Mutton Keema Samosa

మామూలుగా మనం అనేక రకాల సమోసాలను రుచి చూసి ఉంటాం. ఆలూ సమోసా, వెజిటేబుల్స్ సమోసా లాంటివి తింటూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా కూడా మటన్ ఖీమా సమోసా తిన్నారా. ఒకవేళ తినకపోతే ట్రై చేయాలి అనుకుంటున్నారా. మరి ఇంట్లోనే మటన్ ఖీమా సమోసా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మరి మటన్ ఖీమాకు కావలసిన పదార్థాల విషయానికి వస్తే..

మటన్‌ కీమా – అర కేజీ
పచ్చి బఠాణీ – 100 గ్రాముల
తరిగిన ఉల్లిపాయ – ఒకటి
ఉప్పు – టీ స్పూన్‌ లేదా తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌
పచ్చి మిర్చి – 2
కారం పొడి – టీ స్పూన్‌
ధనియాల పొడి– టీ స్పూన్‌
జీలకర్ర పొడి – టేబుల్‌ స్పూన్‌
బంగాళ దుంపలు – 2
కొత్తిమీర తరుగు – కప్పు
నూనె – పావు కేజీ
గోధుమ పిండి – పావు కేజీ.

ఇకపోతే తయారీ విషయానికి వస్తే… ముందుగా గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, వేడి నీటిని పోసి ఒక ముద్దలా కలుపుకుని తడి వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి. తర్వాత బంగాళదుంపలను కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. ఆపై పచ్చి బఠాణీలను కడిగి చిటికెడు చక్కెర వేసి ఉడికించి పక్కన పెట్టాలి. ఖీమాను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరోసారి కడగాలి. మందపాటి పెనంలో టీ స్పూన్‌ నూనె వేసి ఖీమా వేసి రంగు మారేవరకు సన్నమంట మీద వేయించాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బఠాణీ, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

పదిహేను నిమిషాల సేపు సన్న మంట మీద ఉడికించాలి. ఖీమా, బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి ఒకసారి రుచి చూసి అవసరం అయితే మరికొంత ఉప్పు, కారం వేసుకోవాలి. చివరగా కొద్దిసేపు మూత తీసి మంట పెంచి కలుపుతూ ఉడికించాలి. తేమ ఆవిరై పోయి ఖీమా కర్రీ సమోసా స్టఫ్‌ చేయడానికి తగినట్లు రావాలి. గోధుమ పిండిని చపాతీల్లా వత్తుకుని ఒక్కో చపాతీని సగానికి కట్‌ చేసుకోవాలి. ఒక ముక్కని ఐస్‌క్రీమ్‌ కోన్‌లాగ చేసుకోవాలి.
టీ స్పూన్‌ ఖీమా కర్రీ పెట్టి అంచులను అతికిస్తే సమోసా ఆకారం వస్తుంది. చివరగా నూనెను వేడి చేసుకుని సమాసాలను దోరగా వేయించుకుంటే వేడి వేడి మటన్ ఖీమా రెడీ. ఇందులోకి పుదీనా చట్నీ వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది.