Chickenpox VS Monkeypox : చికెన్ పాక్స్…మంకీ పాక్స్…రెండింటి మధ్య తేడాలివే… ఎలా గుర్తించాలో చెబుతున్న వైద్యులు..!!

యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. ఈ క్రమంలోనే మెల్లగా భారత్ లోనూ కేసులు నమోవదు అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 07:00 PM IST

యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. ఈ క్రమంలోనే మెల్లగా భారత్ లోనూ కేసులు నమోవదు అవుతున్నాయి. తాజాగా UAEనుంచి కేరళకు వచ్చి యువకుడికి..విదేశాల్లోనే మంకీపాక్స్ సోకిన లక్షణాలు బయటకు కనిపించాయి. దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మరణించాడు. దీంతో మరింత ఆందోళనకరంగా మారింది.

చికెన్ పాక్స్ ను మంకీ పాక్స్ అనుకుని….
మంకీ పాక్స్ లక్షణాలు చాలా వరకు చికెన్ పాక్స్ వలే ఉండటంతో గందరగోళం నెలకొంది. ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్ లో ఇవిధంగానే చికెన్ పాక్స్ సోకిన వారిని మంకీ పాక్స్ అనే అనుమానంతో ఆసుపత్రులకు తరలించారు. టెస్టుల్లో చికెన్ పాక్స్ గా తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక స్మాల్ పాక్స్ ఇప్పటికే అంతమైంది. చికెన్ పాక్స్ మాత్రం ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో చికెన్ పాక్స్, మంకీ పాక్స్ మధ్య తేడాలు ఎలా గమనించాలనే దానిపై వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

మంకీ పాక్స్ లక్షణాలు…
మంకీ పాక్స్ సోకిన వారిలో ముందుగా జ్వరం, తలనొప్పి, కొందరిలో దగ్గు, గొంతు నొప్పి, లింఫ్ నాళాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సుమారు నాలుగు రోజుల తేడాలో చర్మంపై పొక్కులు వస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. ఇవికాకుండా ముందుగా చేతులు, కళ్ల దగ్గర ఏర్పడి, తర్వాత శరీరం అంతా కూడా విస్తరిస్తాయని చెప్పారు. అదే చికెన్ పాక్స్ లో ముందుగానే చర్మంపై దద్దుర్లు, పొక్కులు కనిపిస్తాయని…తర్వాత జ్వరం వస్తుందని తెలిపారు.

దద్దుర్లు, పొక్కులు పెద్దగా…
చికెన్ పాక్స్ లో దద్దుర్లు, పొక్కులు కాస్త చిన్నగా , విపరీతంగా దురద ఉంటుంది. మంకీ పాక్స్ లో అయితే దద్దుర్లు, పొక్కులు పెద్దగా వస్తాయి. దురద ఎక్కువగా ఉండదు. చికెన్ పాక్స్ లో అరచేతులు, పాదాల కింద దద్దుర్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ. మంకీపాక్స్ లో మాత్రం అరిచేతులు, పాదాలపైనా దద్దుర్లు ఏర్పడతాయి. చికెన్ పాక్స్ వల్ల ఏర్పడే దద్దుర్లు 8 రోజుల తర్వాత తగ్గిపోతాయి. మంకీ పాక్స్ లో మాత్రం 21రోజుల వరకు ఏర్పడుతూనే ఉంటాయని ఫోర్టిస్ మెమెరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం తెలిపింది. మంకీ పాక్స్ లో జ్వరం కూడా ఎక్కువ రోజులు ఉంటుందని వివరించారు.

ఆందోళన అవసరం లేదు…
మంకీ పాక్స్, చికెన్ పాప్స్ రెండూ కూడా ప్రమాదకరం కాదు. మరీ ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రెండింటిలో దేని లక్షణాలు గుర్తించినా…వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.