రేగు పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లను తింటారు. వీటితో పచ్చడి కూడా పెట్టుకుంటారు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడును ఉపయోగించి చేసే కషాయాన్ని మలబద్దకం నివారణకు ఉపయోగిస్తారు. రేగు ఆకులను నూరి పండ్ల మీద రాస్తే త్వరగా నయం అవుతాయి. కడుపులో మంటను తగ్గించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. బరువు పెరగడంలో, కండరాలకు బలాన్ని ఇవ్వటంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కాలేయ పనితీరు బాగా చురుకుగా ఉండటానికి చైనీయులు రేగి పండ్ల టానిక్ ని ఉపయోగిస్తారు.
రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. నిద్ర లేమి సమస్యను తగ్గించటంలో రేగి పండ్లు సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగటానికి కూడా బాగా సహాయపడతాయి. రేగు పేస్టును చర్మంపై పూయడం వల్ల గాయం నయం కావడంతో పాటు చర్మం మృదువుగా ఉంటుంది. రేగులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వలన ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.