వేసవి కాలంలో మనకు అనేక రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో మామిడిపండు కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మామిడిపండును ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ మామిడి పండు కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు చాలామంది ఉన్నారు. మామిడిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మామిడి పండ్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల మంట అజీర్ణం విరోచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అయితే వీటిని తింటే మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. వీటిలో పెద్ద మొత్తంలో పొటాషియం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మామిడి పండ్లలో క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడే ఇతర ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుందని చెబుతున్నారు.
విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి పండ్లలో విటమిన్లు ఎ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే మామిడి పండ్ల స్వభావం వేడిగా ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు దానిని నీటిలో నానబెట్టి తినాలట. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు ఏవీ రావని చెబుతున్నారు. అలాగే మామిడి పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుందట. అయితే మామిడి పండ్లను సాధారణంగా మధ్యాహ్నం తినాలని చెబుతున్నారు. మామిడి ఒక ఘాటైన పండు కాబట్టి రాత్రిపూట తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందట. దీనివల్ల కడుపులో వేడి పెరిగి ముఖంపై మొటిమలు వస్తాయట. కాబట్టి వీలైతే రాత్రిపూట మామిడి పండ్లు తినడం మానుకోవాలని కేవలం మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.