Site icon HashtagU Telugu

Tech Neck : ఫోన్లో మునిగిపోతే ‘టెక్ నెక్’ ప్రాబ్లం

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. ఏ పని కూడా అతిగా చేయొద్దు. ఏ అలవాటుకు కూడా బానిసగా మారొద్దు. స్మార్ట్‌ఫోన్‌లు (Smart Phones), ల్యాప్‌టాప్‌ల (Laptops) అతి వినియోగం డేంజరస్. గంటల తరబడి వాటిని వాడటం వల్ల ‘టెక్ నెక్’ (tech Neck) అనే ప్రాబ్లం వస్తుంది. ఫలితంగా తలనొప్పి, మెడనొప్పి, భుజం నొప్పి, చేతుల్లో జలదరింపు, తిమ్మిరి వస్తాయి. న్యూయార్క్‌కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రిచర్డ్ వెస్ట్‌రీచ్ ఈ సమస్యకు ” కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌” అని పేరు పెట్టారు.

* వైద్య నిపుణుల మాట ఇదీ..

” నా దగ్గర ప్రతిరోజూ OPకి వస్తున్న రోగులలో దాదాపు 20 శాతం మంది టెక్ నెక్‌తో బాధపడుతున్నారు. దీని బాధితుల్లో ఎక్కువ మంది టీనేజర్లు, పిల్లలే ఉన్నారు. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, ట్యాబ్స్ లో గంటల తరబడి గేమ్స్ ఆడటం, ఆన్‌లైన్ క్లాస్ లు ఏకధాటిగా వినడం వల్ల పిల్లలకు”టెక్ నెక్‌” ప్రాబ్లమ్ వస్తోంది. సరైన భంగిమలో కూర్చోక పోవడం వల్ల ఇలా జరుగుతోంది. టెక్ నెక్ వల్ల మెడలోని లిగమెంట్‌లు, కండరాలు , కీళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. ” అని ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ నిపుణులు చెప్పారు.

* మెడను తప్పుడు భంగిమలో పెట్టి..

“మెడను తప్పుడు భంగిమలో పెట్టి పని చేయటం వల్ల అందులోని నరాలు పట్టుకుంటాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఇలా పట్టుకున్న మెడ నరాలు.. పుర్రెకు అటాచ్‌మెంట్ ఉన్న ప్రదేశంలో మంటను కలిగిస్తాయి. ఆ నొప్పి మెడ నుంచి తల వరకు.. తల యొక్క ఫాసియా ద్వారా ముందుకు కూడా వ్యాపిస్తుంది. ఈ నొప్పి దీర్ఘకాలం పాటు కొనసాగితే వ్యక్తి యొక్క మానసిక స్థితిపై కూడా నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ల్యాప్ ట్యాప్, మొబైల్ డివైజ్‌ల స్క్రీన్ ను చూసేటప్పుడు తలను అతిగా వంచడం వల్ల కూడా మెడ నరాలు పట్టుకుంటాయి” అని ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ నిపుణులు చెప్పారు. “మొబైల్ ఫోన్స్ , ల్యాప్ ట్యాప్స్ చూసేటప్పుడు బాగా ముందుకు వంగితే వెన్నెముకపై,మెడపై తల బరువు పడుతుంది. తల బరువు దాదాపు 5 కిలోలు ఉంటుంది. తల ఎంత ఎక్కువగా వంగి ఉంటే, మెడపై ఒత్తిడి అంత పెరుగుతుంది” అని వివరించారు.