LockDown: అక్కడ 5రోజులు లాక్ డౌన్.. కరోనా కాదు కానీ?!

ప్రపంచానికి లాక్ డౌన్ అంటే ఏంటో, దాని రుచి ఎలా ఉంటుందో కరోనా చూపించింది.

  • Written By:
  • Updated On - January 25, 2023 / 10:52 PM IST

LockDown: ప్రపంచానికి లాక్ డౌన్ అంటే ఏంటో, దాని రుచి ఎలా ఉంటుందో కరోనా చూపించింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికి విస్తరించిన కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అప్పట్లో దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ని పాటించాయి. ప్రస్తుతం కరోనా కాస్త నెమ్మదించడంతో అన్ని యధావిదిగా సాగుతున్నాయి. అయితే తాజాగా ఓ రాజధాని నగరంలో ఐదు రోజుల పాటు లాక్ డౌన్ విధించడం వార్తల్లో నిలిచింది.

సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ఉత్తర కొరియా దేశంలో ఈ చిత్ర జరిగింది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ లో ఐదు రోజులు పూర్తి లాక్ డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అంతకంతకు కరోనా తీవ్రత పెరుగుతుండటం, మరణాలు కూడా భారీగా నమోదవుతున్న టైంలో ఉత్తర కొరియా ఇలా లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని దేశాలు కలవర పడ్డాయి.

అయితే ఉత్తర కొరియా మాత్రం దీనిపై వేరేలా స్పందిస్తోంది. తాము లాక్ డౌన్ విధించడానికి కారణం కరోనా కాదని, ఎక్కువ మంది ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని.. కాబట్టే లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని ప్యోంగ్యాంగ్ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అంతా ప్రభుత్వం ఆదేశాలను పాటించాలని, శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైతే వెంటనే తెలియజేయాలని కోరారు.

కాగా ప్రజలు ముందే సరుకులు కొని పెట్టుకొని, లాక్ డౌన్ కు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు చాలా మంది జలుబుతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ప్రపంచ దేశాలను కరోనా భయపెడుతున్న టైంలో, తాము ఆగస్టు నాటికే కోవిడ్ పై విజయం సాధించినట్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటించడం తెలిసిందే.