Drinking Alcohol: తరచూ ప్రజలు ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా మద్యం సేవించే (Drinking Alcohol) వారికి వస్తుందని భావిస్తారు. అయితే ఇది నిజం కాదు. మద్యం సేవించని వారికి కూడా ఫ్యాటీ లివర్ సమస్య రావచ్చు. అనేక పరిశోధనల్లో ఆధునిక జీవనశైలి కారణంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తేలింది. మద్యం సేవించని వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్యాటీ లివర్‌ను వైద్యపరంగా హెపాటిక్ స్టీటోసిస్ అని పిలుస్తారు. ఇది లివర్ కణాలలో సాధారణం కంటే ఎక్కువ కొవ్వు (ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్స్) పేరుకుపోయే పరిస్థితి. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్.
ఎక్కువ మద్యం సేవించే వారికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అయితే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) మద్యం సేవించని లేదా చాలా తక్కువగా సేవించే వారికి వస్తుంది. అనేక పరిశోధనల ప్రకారం.. భారతదేశంలో NAFLD సమస్య వేగంగా పెరుగుతోంది. రాబోయే 10 నుండి 20 సంవత్సరాలలో ఈ సమస్య మరణానికి ప్రధాన కారణంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్యాటీ లివర్‌కు అత్యంత సాధారణ కారణం ఊబకాయం. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 కంటే ఎక్కువ ఉన్న వారిలో NAFLD అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊబకాయం లివర్‌లో కొవ్వును పేరుకుపోవడమే కాకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను కూడా పెంచుతుంది. దీనివల్ల NAFLD మరింత తీవ్రమవుతుంది.
Also Read: India- Pakistan: సింధు జల ఒప్పందం.. భారత్‌కు 4 లేఖలు రాసిన పాక్!
టైప్-2 డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు ఫ్యాటీ లివర్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంది. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించబడనప్పుడు లివర్‌లో కొవ్వు గణనీయంగా పెరుగుతుంది. డయాబెటిస్‌తో బాధపడే వారిలో NAFLD ప్రమాదం 50-80% ఎక్కువగా ఉంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలు, ఫ్రక్టోజ్ ఉన్న పానీయాల అధిక సేవనం కూడా ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణంగా మారుతున్నాయి.
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు (వైట్ బ్రెడ్, వైట్ రైస్, మైదా) మరియు ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహారాలు లివర్‌లో కొవ్వును పెంచుతాయి. హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిలు కూడా ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు. రక్తంలో ట్రైగ్లిసరైడ్ స్థాయి పెరగడం లివర్‌లో కొవ్వును పెంచుతుంది. హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా NAFLD ప్రమాదం మరింత పెరుగుతుంది. కార్టికోస్టెరాయిడ్స్, టామోక్సిఫెన్ వంటి ఔషధాలు కూడా లివర్‌లో కొవ్వు పెరగడానికి కారణమవుతాయి. అంతేకాకుండా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), హెపటైటిస్ సి, హైపోబీటాలిపోప్రొటీనేమియా వంటి జన్యు సంబంధిత రుగ్మతలు కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి.