యూకలిప్టస్ ఆయిల్ దీనినే జామాయిల్ లేదా నీలగిరి తైలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆయిల్ నీలగిరి చెట్టు నుంచి తయారవుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఎక్కడైనా సరే పొడవుగా అందనంత ఎత్తుకు ఎదిగి పోతూ ఉంటాయి. చెట్టు ఆకులు బెరడు, వేర్లు అన్నీ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మంచి సువాసనను కలిగి ఉండడంతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది నీలగిరి చెట్టు. ముఖ్యంగా శ్వాస కోస సమస్యలతో పాటుగా చర్మ సమస్యలను కూడా దూరం చేయడంలో ఈ యూకలిప్టస్ ఆయిల్ ఎంతో బాగా పనిచేస్తుంది.
ఈ ఆయిల్ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాన్ని వస్తే.. శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు నీలగిరి ఆకులు సహాయపడతాయట. యూకలిప్టస్ ఆకుల నుంచి తీసిన నూనెలో ఉండే సినియోల్ అనే కెమికల్ శ్వాసనాళాలను విశాలంగా చేస్తుందట. దీని వల్ల శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుందట. ఆస్తమా, బ్రాంకైటిస్, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వేడి నీళ్లలో నీలగిరి ఆకులను వేసుకొని స్నానం చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుందట. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి తీసుకుంటే ముక్కు దిబ్బడ తగ్గుతుందని చెబుతున్నారు. యూకలిప్టస్ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయట.
వైరస్, బాక్టీరియా వంటివి శరీరంపై దాడి చేయకుండా రక్షణ కల్పించడంలో ఇవి సహాయపడుతుందని చెబుతున్నారు. యూకలిప్టస్ ఆకుల నూనెను నేరుగా చర్మంపై మర్దనా చేయడం వల్ల జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు, ఆర్తరైటిస్ వంటివి తగ్గిపోతాయట. అలాగే ఇది రక్తప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. యూకలిప్టస్ ఆకులలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. చిన్న చిన్న గాయాలు, మచ్చలు, ఇన్ ఫెక్షన్లను తగ్గించేందుకు ఈ ఆకుల పసరు సహాయపడుతుందట. ఈ ఆకుల నూనెతో మర్దనా చేయడం వల్ల చర్మంపై ఉండే చెడు బాక్టీరియా తొలగిపోతుందట. అంతేకాకుండా మొటిమలు, చర్మం మీద మచ్చలు తగ్గించడానికి ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. యూకలిప్టస్ వాసన శరీరాన్ని ఉల్లాసపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుందట. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుందట. అలాగే ధ్యానం లేదా యోగా సమయంలో యూకలిప్టస్ నూనెను డిఫ్యూజర్ ద్వారా వాడడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుందట. దీంతో మానసిక స్థిరత్వం కలుగుతుందని చెబుతున్నారు.