Site icon HashtagU Telugu

Are You Drinking Water Properly?: నీళ్లు త్రాగే విదానం తెలుసుకోండి…

Water Drinking 1024x683

Water Drinking 1024x683

చాలా మంది మంచి నీళ్లు తాగే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో చల్లని వాతారవరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు. ప్రతి రోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత అవసరమో మంచి నీరు కూడా అంతే అవసరం. అయితే నీళ్లు సరిగ్గా తాగకపోతే డీహైడ్రేషన్‌తో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు, రక్తప్రసరణ సమస్య, శరీర ఉష్ణోగ్రత పెరగడం, జీర్ణ సంబంధమైన సమస్యలు, శరీరం తాజాదనాన్ని కోల్పోవడం, అధిక బరువు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూడు స్వింగ్స్, ఆలోచన శక్తి తగ్గిపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమంది సరిపడా నీళ్లు తాగుతున్నా వాటిని సరైన విధానంలో తీసుకోరు. మంచి నీళ్లు తాగాలని హడావిడిగా తాగుతూ ఉంటారు. కానీ మంచి నీళ్లను కూడా సరైన విధంగా తీసుకోవడం ఎంతో అవసరం. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

గోరువెచ్చని నీళ్లు తాగండి:

మంచి నీళ్లు ఎప్పుడూ బాగా చల్లగా లేదా బాగా వేడిగా అసలు తాగకూడదు. చల్లని లేదా వేడి నీళ్లు తాగితేనే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగితే శరీరంలో ఉండే టిష్యూలు ఎఫెక్టివ్‌గా నీటిని పీల్చుకోగలుగుతాయి. గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల డీటాక్సిఫికేషన్ ప్రక్రియ బాగా జరుగుతుంది. డీటాక్సిఫికేషన్‌ వల్ల శరీరంలో ఉండే చెత్త తొలగిపోతుంది. గోరువెచ్చని నీరు తాగితే జీర్ణవ్యవస్థ, జీవక్రియ మెరుగుపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే బరువు కంట్రోల్‌లో ఉంటుంది. శీతాకాలంలొ చల్లని నీరు తాగితే జలుబు, తుమ్ములు వంటి సమస్యలు ఇబ్బందిపెడతాయి.

కూర్చొని మాత్రమే నీళ్లు తాగాలి:

చాలా మంది నిలబడి హడావిడిగా నీళ్లు తాగుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగడం అంతగా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిలబడి నీళ్లు తాగితే బాడీ ఫ్లూయిడ్స్‌ బ్యాలెన్స్‌ దెబ్బతింటుంది. అంతేకాకుండా అనవసరమైన ఫ్లూయిడ్స్ అక్యుమిలేట్ అయిపోతాయి. దాంతో ఆర్థరైటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది, జీర్ణక్రియ దెబ్బతింటుంది. నిలబడి నీటిని తాగితే, చాలా వేగంగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. అలాగే పెద్దప్రేగుకు చేరుకుంటుంది. దీంతో అజీర్తి, అసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా కూర్చుని మాత్రమే మంచినీటిని తాగాలి.

ఆహారంతో పాటుగా మంచి నీటిని తాగొద్దు:

భోజనాన్ని ప్రారంభించే ముందు లేదా భోజనం మధ్యలొ నీళ్లు త్రాగకూడదు. అలా చేయడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడతాయి. ఒకవేళ మంచి నీళ్లు తాగాలనుకుంటే భోజనం చేసే ఒక గంట ముందు తాగండి. ఒకవేళ భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగాలంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి.