కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఆరోగ్యానికి ప్రమాదకరమైన సమస్యగా మారుతున్నాయి. ఇవి మూత్ర మార్గాన్ని బ్లాక్ చేసి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. నడుము నొప్పి, మూత్రంలో రక్తం, మూత్రం కష్టం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నీరు తక్కువగా తాగడం, అధిక ఉప్పు, ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోవడం, జన్యుపరమైన లక్షణాలు, అలాగే ఆక్సలేట్ పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
అసలు కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఎలా ఏర్పడతాయి..?
తరచూ పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, గోధుమ బ్రెడ్ వంటి ఆక్సలేట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో ఖనిజాలు నిలిచి రాళ్లుగా మారుతాయి. అలాగే అధిక బరువు, వ్యాయామం లేని జీవనశైలి, హైపర్ పేరా థైరాయిడిజం, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే సమస్యలు కూడా కిడ్నీ రాళ్లకు కారణమవుతాయి. కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారికి మరింత జాగ్రత్త అవసరం. వేళా వేళకు నీరు తాగకపోతే, మూత్రంలో ఉండే వాడి పదార్థాలు రాళ్లుగా మారే అవకాశముంది.
నివారణకు సాధ్యమైన చిట్కాలు (Tips)
కిడ్నీ రాళ్లను నివారించేందుకు రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగడం చాలా ముఖ్యం. ఉప్పు, మాంసాహారం, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి. ఆక్సలేట్ పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని నియంత్రించాలి. రోజూ కాస్తైనా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా కిడ్నీ రాళ్ల సమస్యను దూరం చేసుకోవచ్చు. సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ వహించడం ఎంతో అవసరం.