Bisibele Bath : కన్నడిగుల స్పెషల్ బిసిబెలాబాత్.. ఇలా చేసుకుని తిన్నారంటే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే..

కన్నడిగుల స్పెషల్ బిసిబెలాబాత్ ఒక్కసారి చేసుకుని రుచి చూస్తే.. మళ్లీ మళ్లీ తింటారు. అంత బాగుంటుందీ వంటకం. సాంబారా లా కాకుండా.. కన్నడ స్టైల్ లో చేస్తే.. లాలాజలం ఊరాల్సిందే.

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 09:34 PM IST

ఆంధ్రా, తెలంగాణ స్టైల్ వంటలే కాదు. ఇతర రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వంటలు కూడా తినాలని ఫుడీ లవర్స్ ఆరాటపడుతుంటారు. పొరుగు రాష్ట్రాల ఫుడ్ ఎక్కడుంటుందో వెతికి మరీ వెళ్తారు. కానీ.. ఇంట్లోనే ఆ రెసిపీని పక్కా కొలతలతో ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కన్నడిగుల స్పెషల్ బిసిబెలాబాత్ ఒక్కసారి చేసుకుని రుచి చూస్తే.. మళ్లీ మళ్లీ తింటారు. అంత బాగుంటుందీ వంటకం. సాంబారా లా కాకుండా.. కన్నడ స్టైల్ లో చేస్తే.. లాలాజలం ఊరాల్సిందే. మరి ఆ రెసిపీ ఎలా చేయాలో.. ఏవేం పదార్థాలు కావాలో తెలుసుకుందాం.

బిసిబెలాబాత్ రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలు

వండిన అన్నం – 2 కప్పులు

క్యారెట్ – 1

ఎండుమిర్చి – 2

కొత్తిమీర తరుగు – 2 స్పూన్లు

మిరియాలు – 4

ధనియాలు – 1 స్పూన్

కందిపప్పు – 1 కప్పు

శనగపప్పు – 2 స్పూన్లు

ఆవాలు – 1 స్పూన్

జీలకర్ర – 1 స్పూన్

జీడిపప్పు – కొద్దిగా

కరివేపాకు – కొద్దిగా

కొబ్బరి తురుము – 1 స్పూన్

చింతపండు – ఉసిరికాయంత

బెల్లం – చిన్న ఉసిరికాయంత

సొరకాయ ముక్కలు – 7

ఉల్లిపాయ – 1

మునక్కాడ – 1

మెంతులు – 1/2 స్పూన్

ఇంగువ – చిటికెడు

నీరు – కావలసినంత

ఉప్పు – రుచికి సరిపడా

బిసిబెలాబాత్ తయారీ విధానం

ముందుగా కుక్కర్లో పైన చెప్పిన క్వాంటిటీలో కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి.. ఉడికించేందుకు సరిపడా నీరు పోయాలి. అందులోనే మునక్కాడ, క్యారెట్, సొరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకుని మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలను వేయించుకుని, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. అందులోనే కొబ్బరి పొడిని కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

స్టవ్ పై మరో పెద్ద గిన్నెను పెట్టి.. కుక్కర్లో ఉడికించుకున్న పప్పును అందులో వేసుకోవాలి. అందులోనే ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడిని వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చింతపండు రసం, బెల్లం తురుమును వేసి మరిగించుకోవాలి. సాంబార్ లా మరుగుతుండగా.. అందులో అన్నం వేసి బాగా కలుపుకోవాలి.

మరో స్టవ్ పై గిన్నె పెట్టి నెయ్యిలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించి వాటన్నింటినీ అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే.. బిసిబెలాబాత్ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది.