Site icon HashtagU Telugu

JN.1 Variant: సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌లో కోవిడ్‌ మళ్లీ విజృంభణ, భారత్‌లో అప్రమత్తత

Jn.1 Variant Corona Virus

Jn.1 Variant Corona Virus

JN.1 Variant: కోవిడ్‌ మళ్లీ రూపం మార్చుకుని విజృంభిస్తోంది. తాజా వేరియంట్‌ పేరు JN.1. ఇది ప్రస్తుతం సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, చైనా, థాయిలాండ్‌ వంటి దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లోనూ దీనిపై ఆందోళన మొదలైంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుల్లో కేసులు పెరుగుతున్నాయి. ముంబయిలోని KEM హాస్పిటల్‌లో ఇద్దరు కరోనా బాధితులు మరణించడంతో అప్రమత్తత మరింత పెరిగింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అలర్ట్‌ మోడ్‌లోకి వెళ్లింది.

JN.1 వేరియంట్ అంటే ఏమిటి?

ఇది ఒమిక్రాన్‌ వంశానికి చెందిన BA.2.86 లైన్‌ నుంచి వచ్చిన వేరియంట్‌. 2023 ఆగస్ట్‌లో మొదటిసారిగా ఈ వేరియంట్‌ గుర్తించబడింది. దీనిలో సుమారు 30 మ్యూటేషన్లు ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుని దాడిచేయడంలో దోహదపడతాయి. దీనికితోడు LF.7, NB.1.8 అనే సబ్‌ వేరియంట్లు కూడా ఈసారి కేసుల పెరుగుదలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.

భారత్‌కు ఎంతవరకు ప్రమాదం?

JN.1 వేరియంట్‌ తీవ్రమైందా? అంటు శక్తి ఎక్కువగా ఉందా? అనే ప్రశ్నలకు ఇప్పటిదాకా స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వారికీ ఈ వైరస్‌ త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్‌, ట్రాకింగ్‌, మానిటరింగ్‌ చర్యలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.