Heart Healthy: గుండెపోటు అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఏమిటి ?

గుండె కండరాలలోని కొన్ని భాగాలకు తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు వస్తుంది.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 09:30 AM IST

గుండె కండరాలలోని కొన్ని భాగాలకు తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు వస్తుంది. దీనికి సకాలంలో చికిత్స చేసి గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించాలి. ఈ ప్రక్రియలో ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె కండరాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్‌ అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో ఒకటి పూర్తిగా పూడుకుపోవడం వల్ల ఎదురయ్యే తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీ. దీనివల్ల గుండెకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, ఛాతీ నొప్పి రావడంతో పాటు మయోకార్డియల్ కణజాలం చనిపోతుంది. గుండెపోటుకు ప్రధాన కారణం కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD). గుండె కండరాలకు ఆక్సిజన్ ఉండే రక్తం వెళ్లే మార్గం ఒక్కసారిగా సంకోచించడం వల్ల గుండెపోటు రావచ్చు. గుండెపోటుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. వీటి ద్వారా హార్ట్ అటాక్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చు. ప్రధాన లక్షణాలు ఏవంటే..

* ఛాతీ నొప్పి, శ్వాస సమస్యలు 

గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే ఏ కారణంతో హార్ట్ అటాక్ వచ్చినా, దీని ప్రాథమిక లక్షణం ఛాతీ నొప్పి. గుండెపోటు వచ్చేముందు ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యంగా ఉంటుంది. ఇదే సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉంటుంది లేదా కాసేపు తగ్గి మళ్లీ పెరుగుతుంది. ఒత్తిడి, కండరాలు పిండేసినట్లు అనిపించడం, తెలియని నొప్పి వంటి అనుభూతిని కలిగిస్తుంది.

* గుండెల్లో మంట

కొందరిలో గుండెపోటు సమయంలో ఈ లక్షణాలు ఉంటాయి. బాధితులు వాంతులు కూడా చేసుకోవచ్చు. పురుషుల కంటే స్త్రీలలో ఈ రకమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు తినే ఆహారం వల్ల కూడా కడుపునొప్పి రావచ్చు. అయితే దీనితో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. సాధ్యమైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.

* భుజం నొప్పి

గుండెపోటుకు మరో ప్రాథమిక లక్షణం శరీరంలోని ఎడమ వైపు భాగాల్లో నొప్పి రావడం. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి మొదలవుతుంది. క్రమంగా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఎడమ చెయ్యి లేదా ఎడమ వైపు భుజం కండరాల్లో నొప్పి ఉన్నట్లు అనిపించడం గుండెపోటు లక్షణం కావచ్చు.

* తలతిరగడం

గుండెపోటు వచ్చేముందు తల తేలికగా ఉన్నట్లు లేదా తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. తర్వాత కొన్ని క్షణాలు మూర్చపోవచ్చు. స్థిరంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండలేకపోవడంతో పాటు ఛాతీలో అసౌకర్యం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండె పనితీరుపై ప్రభావం పడినప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

* దవడ నొప్పి

సాధారణంగా గొంతు లేదా దవడ నొప్పికి గుండె సమస్యలకు సంబంధం ఉండదు. కానీ మీ ఛాతీ మధ్యలో నొప్పి లేదా తెలియని ఒత్తిడి ఏర్పడి, అది మీ గొంతు లేదా దవడ వరకు వ్యాపిస్తే.. అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. ఇలాంటప్పుడు సాధ్యమైనంత తర్వగా వైద్య సహాయం తీసుకోవాలి.

* అలసిపోవడం

రోజూ చేసే చిన్నపాటి పనులకే విపరీతంగా అలసిపోయినట్లు అనిపిస్తే.. అప్రమత్తం కావాల్సిందే. విపరీతమైన అలసట లేదా వివరించలేని బలహీనత అనేవి మహిళల్లో గుండె జబ్బులకు లక్షణం కావచ్చు. ఈ అనుభూతి కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు.

* చల్లని చెమటలు

స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా చల్లని చెమట పట్టడం అనేది గుండెపోటు లక్షణం కావచ్చు. ఇతర హార్ట్ అటాక్ లక్షణాలతో పాటు ఇలా చెమట కూడా పడుతుంతే.. వెంటనే వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

* విపరీతమైన దగ్గు

మామూలు పరిస్థితుల్లో దగ్గు గుండె జబ్బులకు లక్షణం కాదు. కానీ ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారిలో దగ్గు వస్తూ, తెల్లని లేదా గులాబీ రంగులో ఉండే శ్లేష్మం కూడా వస్తుంటే అనుమానించాల్సిందే. ఇది గుండె వైఫల్యానికి సంకేతం కావచ్చు. గుండె పనితీరు దెబ్బతిని, ఊపిరితిత్తులలోకి రక్తం లీక్ అయినప్పుడు ఇలా జరగవచ్చు. అందుకే ఈ లక్షణం ఉన్నవారు వెంటనే వైద్యుల సలహాతో టెస్టులు చేయించుకోవాలి.

* కాళ్లు ఉబ్బడం 

కాళ్లు, పాదాలతో పాటు చీలమండం ప్రాతం ఉబ్బినట్లు అనిపిస్తే.. మీ గుండె రక్తాన్ని సక్రమంగా పంప్ చేయట్లేదని అర్థం. ఇది గుండె వైఫల్యంతో పాటు హార్ట్ అటాక్‌కు కారణం కావచ్చు. గుండె తగినంత వేగంగా రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేయలేనప్పుడు, రక్తం సిరల్లోకి తిరిగి వచ్చి, అవి ఉబ్బుతాయి. గుండె పనితీరు దెబ్బతినడం వల్ల మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు నీరు, సోడియంను తొలగించలేవు.

* గుండె వేగం పెరగడం

ఎక్కువ భయాందోళనలకు గురైనప్పుడు లేదా ఉత్సాహంగా ఉన్నప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణ విషయం. కానీ ఏ కారణం లేకుండా మీ గుండె కేవలం కొన్ని సెకన్ల పాటు ఎక్కువ వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించడం లేదా తరచుగా ఇలా జరగడం గుండెపోటు లక్షణం.