. పాప్‌కార్న్‌లోని పోషక విలువలు
. యాంటీఆక్సిడెంట్లతో వ్యాధుల నివారణ
. బరువు నియంత్రణలో పాప్‌కార్న్ పాత్ర
Pop Corn : మనం రోజూ ఆహారంగా తీసుకునే చిరుతిళ్లలో పాప్‌కార్న్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పిల్లలు, యువత దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. సినిమా థియేటర్‌కి వెళ్లినప్పుడు లేదా ఇంట్లో టైంపాస్ కోసం పాప్‌కార్న్ తినడం సాధారణమే. చాలామందికి ఇది కేవలం కాలక్షేపానికి మాత్రమే అనిపించినా, నిజానికి సరైన విధంగా తీసుకుంటే పాప్‌కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్‌లో లభించే బటర్, చీజ్, క్యారమెల్ వంటి ఫ్లేవర్ పాప్‌కార్న్‌లకు బదులుగా సాధారణంగా, ఫ్లేవర్స్ లేని పాప్‌కార్న్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
పాప్‌కార్న్ 100 శాతం తృణధాన్యాలతో తయారవుతుంది. అందువల్ల దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేగుల కదలికలను సక్రమంగా ఉంచి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ కొద్దిగా పాప్‌కార్న్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను నివారించుకోవాలనుకునే వారికి ఇది మంచి చిరుతిండి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నియంత్రించడంలో ఫైబర్ సహాయపడుతుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పరిమితంగా, ఉప్పు లేదా వెన్న లేకుండా పాప్‌కార్న్‌ను తీసుకోవచ్చు.
పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్‌ను నశింపజేసి కణాలను రక్షిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే చర్మ ముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలను కూడా యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం పాప్‌కార్న్‌ను నియమితంగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గే సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం కూడా కొంతవరకు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఇది పిల్లలకే కాదు, పెద్దలకూ ఉపయోగకరమైన ఆహారంగా చెప్పవచ్చు.
పాప్‌కార్న్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు లేదా తమ బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చక్కటి స్నాక్. పాప్‌కార్న్ తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో తరచూ ఆకలి వేయదు, అనవసరంగా ఎక్కువగా తినకుండా ఉంటాం. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది. ఇది గ్లూటెన్ రహితమైన ఆహారం కావడం మరో విశేషం. గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారు కూడా దీనిని నిశ్చింతగా తీసుకోవచ్చు. బ్రెడ్ లేదా ఇతర మైదా పదార్థాలకు బదులుగా కొన్ని రెసిపీల్లో పాప్‌కార్న్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మార్కెట్‌లో దొరికే ఉప్పు, కారం, వెన్న, చీజ్, క్యారమెల్ వంటి ఫ్లేవర్ పాప్‌కార్న్‌లు ఆరోగ్యానికి మేలు చేయవు. వీటిలో ఉప్పు, కొవ్వు అధికంగా ఉండటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కాబట్టి ఇంట్లో మైక్రోవేవ్ లేదా స్టౌవ్‌పై తయారుచేసుకునే, ఎలాంటి ఫ్లేవర్స్ లేని సాధారణ పాప్‌కార్న్‌ను మాత్రమే ఎంచుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
