Monkey Pox : మంకీపాక్స్ లైంగికంగా సంక్రమిస్తుందా ? వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలివి!!

మంకీపాక్స్ దడ పుట్టిస్తోంది. మన దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 4కు పెరిగింది.

  • Written By:
  • Publish Date - July 25, 2022 / 08:00 PM IST

మంకీపాక్స్ దడ పుట్టిస్తోంది. మన దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 4కు పెరిగింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తి లో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్ వైరస్ ను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య  అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈనేపథ్యంలో ఇది ఎలా వ్యాపిస్తుంది ? దీని లక్షణాలేంటి ?లైంగికంగా సంక్రమిస్తుందా ? అనే సందేహాలు ప్రజల మదిలో మెదులుతున్నాయి.

మంకీపాక్స్ ఇలా మొదలైంది..

మంకీపాక్స్ ఒక వైరల్‌ డిసీజ్‌. మంకీపాక్స్‌‌ స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్‌ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది.
మంకీపాక్స్ అనేది కొత్త వ్యాధేం కాదు. దీని మొదటి కేసు 1958 లో నమోదైంది. 1958లో డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ లోని ఓ పరిశోధనా కేంద్రంలో ప్రయోగశాల పరీక్షా కోతుల సమూహంలో ఈ వ్యాధి వ్యాపించడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఈ వ్యాధి కోతుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.
మంకీపాక్స్ వ్యాప్తిలో జంతువుల పాత్ర కీలకమైందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మనుషులు, కోతులు, అడవి ఎలుకల ద్వారా  ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మంకీపాక్స్ కేసులు పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్ వే అని గంగారామ్ హాస్పటల్ లోని ఇంటెన్సివిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ధీరేన్ గుప్తా తెలియజేశారు.

వ్యాప్తి ఇలా జరుగుతోంది?

* మంకీపాక్స్ కోతులు, అడవి ఎలుకలు, ఉడుతలు, దీర్థకాలిక సంపర్కం, మంకీపాక్స్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంపర్కం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది.
* ఇది గాలి ద్వారా వ్యాపించదు.
* కానీ ఇది సోకిన రోగితో సన్నిహితంగా ఉంటే.. వారి నోటి పెద్ద పెద్ద బిందువుల ద్వారా సంక్రమిస్తుంది. దీని సెకండరీ ఎటాక్ 7  రెట్లు ఉంటుంది.

తాజా అధ్య‌య‌నం ఏం చెబుతోంది?

తాజా అధ్య‌య‌నంలో మంకీపాక్స్ వ్యాధికి సంబంధించిన మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం వెల్ల‌డైంది. మంకీపాక్స్ అనేది సెక్సువ‌ల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ (ఎస్టీడీ) అని తేలింది. 95% కేసులు లైంగిక కార్యకలాపాల ద్వారా సంక్రమించాయ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు.

మంకీపాక్స్ ముప్పు ఎవరికి ఎక్కువ ?

* ఈ మంకీపాక్స్ కేసులు ఎక్కువగా పురుషుల్లోనే కనిపిస్తున్నాయి.
* లెస్బియన్ , గేలకు కూడా మంకీపాక్స్ సోకే అవకాశం ఎక్కువ.
* పురుషులు, LGBTQ వారితో సెక్స్ లో పాల్గొనే పురుషులు దీని సంక్రమణకు ఎక్కువగా గురయ్యే ముప్పు ఉంటుంది.
*  రోగులకు సేవలు చేసే హెల్త్ కేర్ వర్కర్లకు కూడా మంకీపాక్స్ ప్రమాదం ఎక్కువగా ఉంది.
*  రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు, దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

మంకీపాక్స్ లక్షణాలు?

జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చికిత్స ఏమిటి?

మంకీపాక్స్‌కు కచ్చితంగా ఒక ట్రీట్మెంట్‌ లేనప్పటికీ, ఈ వ్యాధిని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్‌ మందులను ఇస్తున్నారు. స్మాల్‌పాక్స్‌‌ వ్యాక్సిన్‌‌‌‌ మంకీపాక్స్‌ చికిత్సలో 85% సమర్థవంతగా పనిచేస్తుంది. అమెరికా జిన్నెయోస్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది.