. జీర్ణ ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన వరం
. జీర్ణక్రియను మెరుగుపరచే ప్రోబయాటిక్స్
. గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో పెరుగు పాత్ర
. హైపర్ అసిడిటీ, లాక్టోస్ సమస్యలకు ఉపశమనం
Curd : మన రోజువారీ ఆహారంలో పాల పదార్థాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వాటిలో ముఖ్యంగా పెరుగు అనేది తరతరాలుగా మన ఆహార సంస్కృతిలో భాగంగా నిలిచిపోయింది. చాలా మందికి పెరుగు లేకుండా భోజనం పూర్తయినట్టే అనిపించదు. కేవలం రుచికోసమే కాకుండా, ఆరోగ్య పరంగానూ పెరుగు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పెరుగులో సహజంగా ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆహారాన్ని సులభంగా విచ్ఛిన్నం చేసి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. దీంతో ఆహారం ప్రేగుల గుండా సజావుగా కదులుతుంది. మలబద్ధకం తగ్గడంతో పాటు ప్రేగుల్లో గ్యాస్ ఏర్పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. తరచూ గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్యలతో బాధపడే వారికి పెరుగు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పొట్టలో ఉన్న మంచిబ్యాక్టీరియా సమతుల్యతను కాపాడటం ద్వారా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.
పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ తయారయ్యే ప్రక్రియ తగ్గుతుంది. అంతేకాదు, ఇప్పటికే ఏర్పడిన గ్యాస్ సులభంగా బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి. అతిగా తిన్న తర్వాత గ్యాస్ ఎక్కువగా ఏర్పడే వారికి భోజనంతో పాటు పెరుగు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంతో గ్యాస్ సమస్యను నియంత్రించడంలో దోహదపడుతుంది.
పెరుగులోని ప్రత్యేక ఎంజైమ్‌లు సంక్లిష్టమైన ఆహారాలను సైతం సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా లాక్టోస్‌ను జీర్ణం చేయడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. స్వల్ప లాక్టోస్ అసహనం ఉన్నవారు పెరుగును మితంగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే పెరుగు జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలను సమతుల్యంలో ఉంచి హైపర్ అసిడిటీని తగ్గిస్తుంది. ఛాతీ మంట, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు క్రమంగా తగ్గుతాయి.
అయితే కఫం, దగ్గు, జలుబు లేదా అలర్జీ సమస్యలు ఉన్నవారు రాత్రి వేళ పెరుగు తీసుకోవడం నివారించడం మంచిది. అలాగే తీవ్రమైన లాక్టోస్ అసహనం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే పెరుగు తీసుకోవాలి. సరైన సమయాల్లో, మితంగా పెరుగు తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడి మొత్తం ఆరోగ్యానికే మేలు చేకూరుతుంది.
