Green Chillies : భారతదేశంలో వంటకాలకు కారమే ప్రాణం అనేంతగా మనం కారం ప్రేమించేవాళ్లం. కూరల్లోనూ, కూరగాయల్లోనూ, స్నాక్స్‌లోనూ ఏ వంటకాన్ని తీసుకున్నా కారం లేకపోతే తినలేమన్నంతగా ఒక అలవాటు ఉంది. మన వంటకాలు కారంగా ఉండటంతో, ఇతర దేశాలవారు వాటిని తినడానికి కూడా వెనకాడతారు. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితి కాస్త మారింది. ఇప్పుడు చాలామంది కారం తినడం తగ్గించేశారు. పిల్లలు, యువత వీరంతా పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైస్‌ల వంటి జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు దారితీస్తోంది. చిన్నతనంలోనే కారం తినే అలవాటు ఉండేది కానీ, ఇప్పుడు చిన్నారులు మాత్రం కారం తినడం పూర్తిగా మానేశారు.
Read Also: Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి
కారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని, అల్సర్‌లకు కారణమవుతుందని ఒక నమ్మకం ఉంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. కారం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నా, అల్సర్లు రావడానికి కేవలం కారం ఒక్కటే కారణం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతలోనే ఆయుర్వేదం ఒక విశేష విషయాన్ని చెబుతోంది. మితంగా కారం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని. ముఖ్యంగా పచ్చి మిర్చిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే క్యాప్సెయిసిన్ అనే ఘటకం శరీర మేటబాలిజాన్ని పెంచుతుంది. ఇది క్యాలరీలు ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా శరీరంలోని కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గే వారికి ఇది ఓ సహాయక హేతువవుతుంది.
అంతేకాదు, పచ్చిమిర్చిలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. మరొక ఆసక్తికరమైన ప్రయోజనం ఏమిటంటే, విటమిన్ C శరీరంలో ఐరన్‌ను మెరుగ్గా శోషించడానికి సహాయపడుతుంది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత తగ్గుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పచ్చిమిర్చిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెకు ఎంతో మంచిది. రక్తనాళాల అడ్డంకులు తొలగిపోవడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. క్యాప్సెయిసిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలుండటంతో, శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ బాధితులకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.
అలాగే, పచ్చిమిర్చి జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. అయితే, ఈ ప్రయోజనాలన్నింటిని పొందాలంటే పచ్చిమిర్చిని మితంగా తినడమే మంచిది. రోజుకు 1 లేదా 2 మిర్చి తినడం సరిపోతుంది. కానీ దీనిని అధికంగా తింటే అదే క్యాప్సెయిసిన్ కారణంగా జీర్ణాశయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అసిడిటీ, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. కొంతమంది కారాన్ని ఎక్కువగా తినడంవల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే మితమే మాణిక్యం అన్న చందంగా, పచ్చిమిర్చిని మోతాదులో తినడం వల్లనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి ఇవి కేవలం రుచి కోసం కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోణంలోనూ అత్యంత ముఖ్యమైనవి. తగిన మోతాదులో కారం తినడం వల్ల శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. అయితే, అతి కారం ఆరోగ్యానికి శత్రువుగా మారుతుంది. కాబట్టి కారాన్ని సమతుల్యంగా తినడం నేర్చుకుంటే, అది రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి రక్షణ కవచంగా మారుతుంది.