. పచ్చి బీట్‌రూట్..పోషకాల పవర్ హౌస్
. ఉడికించిన బీట్‌రూట్..సులభ జీర్ణానికి సరైన ఎంపిక
. ఏ రూపంలో తీసుకుంటే మంచిది?.. సరైన మార్గం ఇదే
Beetroot : మన శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందించే సూపర్ ఫుడ్‌లలో బీట్‌రూట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎర్రని రంగు, తియ్యని రుచి మాత్రమే కాదు..ఇందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలే దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. నైట్రేట్లు, బీటాలైన్లు, ఫోలేట్, విటమిన్ C, ఫైబర్ వంటి కీలక పోషకాలతో బీట్‌రూట్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. సలాడ్‌గా, జ్యూస్‌గా, సూప్‌గా, తాజాగా ట్రెండ్ అవుతున్న బీట్‌రూట్ షాట్స్ రూపంలోనూ దీనిని తీసుకుంటున్నారు. అయితే ఒక సందేహం మాత్రం చాలామందిలో ఉంటుంది. బీట్‌రూట్‌ను పచ్చిగా తినాలా? లేక ఉడికించి తినాలా? శాస్త్రం ఏమి చెబుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి. 100 గ్రాముల ముడి బీట్‌రూట్‌లో తక్కువ క్యాలరీలు ఉండడంతో పాటు మంచి ఫైబర్, పొటాషియం, ఐరన్, శక్తివంతమైన బీటాలైన్లు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని నైట్రేట్లు రక్తనాళాలను విస్తరింపజేసి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిపై జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం పచ్చి బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హెచ్‌బీఏ1సీ స్థాయిలు, రక్తపోటు మెరుగుపడ్డాయని వెల్లడైంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఎక్కువసేపు ఆకలి కాకుండా కడుపు నిండిన భావన కలుగుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఇది మంచి మిత్రం. అయితే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పచ్చి బీట్‌రూట్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.
బీట్‌రూట్‌ను ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు కొంతమేర తగ్గినా ఇది జీర్ణానికి చాలా సులభంగా మారుతుంది. ఉడికించినప్పుడు ఫైబర్ మృదువుగా మారి కడుపుకు భారంగా ఉండదు. గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. ముఖ్యంగా ఉడికించిన బీట్‌రూట్‌లో ఆక్సలేట్స్ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు ఉడికించిన బీట్‌రూట్‌ను సురక్షితంగా తీసుకోవచ్చు. అలాగే ఉడికించిన బీట్‌రూట్‌లోని పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి. సూప్‌లు, రైతా, వేయించిన సలాడ్‌లలో దీనిని ఉపయోగిస్తే రుచి కూడా పెరుగుతుంది.
పచ్చి బీట్‌రూట్ ఉడికించిన బీట్‌రూట్ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంపిక చేసుకోవడమే ముఖ్యమైన విషయం. రోజువారీ సలాడ్లు, స్మూతీలు, జ్యూస్‌లలో పచ్చి బీట్‌రూట్‌ను తురిమి వేసుకోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడేవారు ఉడికించిన బీట్‌రూట్‌ను ఎంచుకోవడం మంచిది. బీట్‌రూట్‌ను ఉడికించేటప్పుడు 20 నుంచి 30 నిమిషాల వరకు చిన్న మంటపై ఉడికిస్తే పోషకాలు ఎక్కువగా నిలుస్తాయి. సరైన మోతాదులో సరైన విధానంలో బీట్‌రూట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అది నిజంగా మన శరీరానికి సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది.
