Healthy Heart : మీ గుండె పదిలంగా ఉండాలంటే..వీటిని ఆహారంలో చేర్చుకోవాల్సిందే..!!

  • Written By:
  • Publish Date - November 1, 2022 / 12:12 PM IST

నేటికాలంలో సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, షుగర్, బీపీ ఇవన్నీ కారణాలతో భారత్ లో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతకొన్నేళ్లుగా దేశంలో గుండెపోటు కేసులు, వాటి కారణంగా మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఒక్కప్పుడు వయస్సు మీదపడినవారికే గుండెజబ్బపులు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ప్రతిఒక్కరూ తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీరు రోజంతా కష్టపడాల్సిన పనిలేదు. కానీ మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.

పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మీ ఆరోగ్యానికి అవసరం. కానీ అధికరక్తపోటు, కొలెస్ట్రాల్, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే గుండె సక్రమంగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారంలో మెగ్నీషియంను చేర్చుకోండి. దీనిని మాస్టర్ మినరల్ అని కూడా అంటారు. గుండె కండరాలను బలపరిచి, జబ్బుల నుంచి దూరంగా ఉంచే ఐదు రకాల మెగ్నీషియం ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

1. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లో మెగ్నిషియంతోపాటు అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. న్యూట్రియంట్స్ లో ప్రచురితమైన కథనం ప్రకారం..ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనోల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీ గుండెకు మేలు చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాల్స్ ఉన్నాయని పరిశోధనలు కనుగొన్నాయి.

2. నట్స్
నట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడలో సహాయపడతాయి. మీ గుండెను సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ నట్స్ తీసుకోండి.

3. గింజలు
చియా, పొద్దుతిరుగుడు, గుమ్మడిగింజలు వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోండి. ఇందులో మెగ్నిషియం ఉంటుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను బలంగా ఉంచుతాయి.

4. అరటిపండ్లు
అరటిపండ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. చౌకగా లభిస్తాయి. వీటిలో పొటాషియం ఉంటుంది. పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియంతోపాటు మెగ్నిషియం కూడా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ 1 అరటి పండు తినాలని వైద్యులు చెబుతుంటారు.

5. గ్రీన్ లీఫి వెజిటేబుల్స్
మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆకుకూరలు ఖచ్చితంగా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. బచ్చలికూర, మెంతికూర, ఆవాఆకులు, కాలే వంటి వాటిలో మెగ్నిషియం ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోండి.