శరీరంలోని అవయవాలు అన్ని సక్రమంగా పనిచేయాలి అంటే తప్పనిసరిగా విటమిన్ బి-12 ని ఉపయోగించాలి. ఒకవేళ శరీరంలో విటమిన్ బి-12 లోపిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటప్పుడు మనం ఏం చేయాలి. విటమిన్ బి12 లోపించకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీర అవయవ పనితీరు మెరుగ్గా ఉండాలి అంటే విటమిన్లు తప్పనిసరి. ఇక విటమిన్ బి 12 ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. విటమిన్ బి-12 ముఖ్యంగా మెదడు, ఎముకలు పనితీరులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా రక్త కణాల వృద్ధికి,డిఎన్ఏ తయారీకి ఇది సహాయపడుతుంది. మన శరీరం దీన్ని సహజంగా ఉత్పత్తి చేసుకోలేదు. దాంతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉంచుకోలేదు కాబట్టి శాకాహార ఉత్పత్తుల్లో ఇది చాలా తక్కువగా ఉంటుంది.
కనుక విటమిన్ బి-12 లోపం శాకాహారుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలోనూ, రోగనిరోధక వ్యవస్థలో లోపాలు ఉంటే వారిలోనూ విటమిన్ బి-12 లోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విటమిన్ బి-12 లోపిస్తే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో బి -12 లోపం ఏర్పడినప్పుడు అధిక ఒత్తిడి, అలసట,తలనొప్పి వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లోపాన్ని అజాగ్రత్త చేస్తే చర్మం పాలిపోవడం, నీరసంగా అనిపించడం, నాలుక నున్నగా మారడం, మలబద్ధకం డయేరియా తగ్గకపోవడం, ఆకలి లేకపోవడం, కండరాలు బలహీనపడటం, కంటిచూపు మందగించడం, నడవలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా జ్ఞాపకశక్తి క్షీణించడం, రక్తహీనత, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ లోపాన్ని నిర్లక్ష్యం చేయకుండా విటమిన్ బి-12 అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అయితే సముద్రపు చేపలను తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్ బి-12 పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, రిబోఫ్లేవిన్, నియాసిస్, థియామిన్, విటమిన బి 6 వంటి పోషకాలు శరీరానికి లభిస్తాయి. అదేవిధంగా మాంసాహారంలో కూడా విటమిన్ బి-12 సమృద్ధిగా ఉంటుంది. గుడ్లు కూడా విటమిన్ బి-12 అందించే ముఖ్యమైన పౌష్టికాహార జాబితాలో ఉంది. కనుక గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.